కరోనాతో ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టేందుకు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. అయితే.. ప్యాకేజీ నిధుల కోసం కేంద్రం ప్రధానంగా పెట్రోల్, డీజిల్‌పై విధించే పన్నులు, ఆర్బీఐ డివిడెండ్పైనే అధికంగా ఆధార పడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
పెట్రోల్, డీజిల్‌పై భారీ వడ్డన
కరోనా మహమ్మారి విజృంభణతో తలెత్తిన పరిస్థితులు, ఆర్థిక ప్యాకేజీ అవసరంపై దృష్టి పెట్టిన కేంద్రం మే 5న గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్‌పై లీటరుకు రూ.10, డీజిల్‌పై లీటరుకు రూ.13 ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీంతో ప్రభుత్వానికి 2021 ఆర్థిక ఏడాదిలో రూ. 1,75,000 కోట్ల ఆదాయం సమకూరనుంది. రానున్న రోజుల్లో చమురుపై లీటరుకు రూ. 3-6 పెంచవచ్చు. దాని ద్వారా సుమారు రూ. 50,000-60,000 కోట్లు అదనపు రాబడి రానుంది. పెట్రోలియం ఉత్పత్తులపైనే ఆదాయం దాదాపుగా రూ. 2,25,000 కోట్లు వస్తుంది. ఈ ఏడాది ఇప్పటికే పెట్రోలియం విభాగం నుంచి ఎక్సైజ్ ఆదాయం రూ.2,15,000 కోట్లు వచ్చింది.
మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు కొన్ని ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచే అవకాశం ఉంది.