కరోనా వైరస్‌పై పోరుకు ఆర్థిక రంగంలో కీలకమార్పులు ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు వైరస్‌పై సమర్థంగా పోరాడేందుకు త్వరలో ఆర్థిక ప్యాకేజీ తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి ప్రకటనలోని కీలక అంశాలు.
- కరోనా సంక్షోభంపై అతి త్వరలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తాం.
- 2019 ఆదాయపన్నుల రిటర్నులు దాఖలు చేసేందుకు ఆఖరు తేది జూన్ 30 వరకు పెంపు.
- రిటర్నుల దాఖలు ఆలస్యమైతే చెల్లించాల్సిన వడ్డీ 12 నుంచి 9 శాతానికి తగ్గింపు.
- ఆధార్-పాన్ లింక్ చేయడానికి, వివాద్ సే విశ్వాస్ పథకం తుది గడువు జూన్ 30.
- మార్చి, ఏప్రిల్, మే మాసాల జీఎస్టీ దాఖలు చివరి తేది జూన్ 30.
- రూ. 5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న సంస్థలపై జీఎస్టీ రిటర్నుల దాఖలు ఆలస్యమైతే వడ్డీ, పెనాల్టీ, ఆలస్య రుసుములు రద్దు.
- రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న సంస్థల జీఎస్టీ రిటర్నుల చెల్లింపు ఆలస్యమైతే పెనాల్టీ విధింపు, వడ్డీ రేటు 9 శాతం వర్తింపు.
- కంపెనీల బోర్డు సమావేశాలు రెండు నెలల పాటు వాయిదా.
- చిన్న, మధ్యతరహా వ్యాపారసంస్థల దివాలాను నియంత్రించేందుకు రుణపరిమితిని రూ. లక్ష నుంచి రూ. కోటికి పెంపు.
- ఏప్రిల్ తర్వాత సంక్షోభం కొనసాగితే ఆరు నెలలపాటు రుణ ఎగవేత సెక్షన్ల రద్దు.
- 3 నెలల వరకు ఏ బ్యాంకు ఏటీఎం సేవల్ని వినియోగించుకున్నా ఎలాంటి రుసుములు ఉండవు.
- సేవింగ్స్ ఖాతాల్లో కనీస మొత్తం ఉంచాలన్న నిబంధనలు తొలగింపు.