వినియోగం పెంచి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) క్యాష్ ఓచర్ పథకానికి సంబంధించి మరిన్ని కీలక విషయాలను వెల్లడించింది ఆర్థిక శాఖ. ప్రభుత్వ ఉద్యోగులు తమ పేరు మీద కొనుగోలు చేసిన వస్తువులు, సేవలకు సంబంధించి మల్టిపుల్ (ఒకటికన్నా ఎక్కువ) బిల్లులను ఎల్టీసీ క్యాష్ ఓచర్ ప్రయోజనాలు పొందేందుకు దాఖలు చేయొచ్చని తెలిపింది.
12 శాతం అంతకన్నా ఎక్కువ జీఎస్టీ వర్తించే వస్తులు, సేవలను కొనుగోలు చేయడం ద్వారా.. ఉద్యోగులు ఎల్టీసీ క్యాష్ ఓచర్‌ను ప్రయోజనాన్ని పొందొచ్చని ఈ నెల 12న కేంద్రం ప్రకటించింది. ఈ పథకంపై ఉద్యోగుల్లో నెలకొన్న సందేహాలపై.. ఎఫ్ఏక్యూ (తరచూ అడిగిన ప్రశ్నలు) జాబితాను విడుదల చేసింది ఆర్థిక శాఖలోని వ్యయాల విభాగం.
ఇప్పటి వరకు ఉద్యోగులు ప్రయాణాలు చేస్తే మాత్రమే ప్రయోజనాలు పొందేవారు. లేదా ఆ మొత్తాన్ని వదులు కోవాల్సి వచ్చేది.
లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ లేకుండా.. ఎల్టీసీని ఉపయోగించుకోవచ్చని ఆర్థిక శాఖ తెలిపింది. అయితే ఈ ఖర్చు ఎల్టీసీ ఛార్జీలకు నిర్దేశించిన నిష్పత్తిలోనే ఉండాలని స్పష్టం చేసింది.