సాగుచట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ తమ ప్రభుత్వం అన్నదాతల శ్రేయస్సుకు కట్టుబడి ఉందని 2021బడ్జెట్ ప్రసంగంలో.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అన్ని పంటల కనీసమద్దతు ధర పెంచడం సహా.. టమోట, బంగాళదుంప, ఉల్లిపాయలతో పాటు ఎగుమతులు చేసే పంట ఉత్పత్తుల సంఖ్యను 22కు పెంచుతున్నట్లు తెలిపారు. రుణ వితరణ లక్ష్యాన్ని కూడా పెంచుతున్నామన్నారు. యూపీఏ హయాంలో గోధుమ రైతులకు చెల్లించిన మొత్తం.. 2019-20కి రెండింతలైందన్న నిర్మల.. ధాన్యం చెల్లింపులు ఒకటిన్నర రెట్లు వరకు పెరిగాయన్నారు. తృణధాన్యాల విషయంలో రైతులకు చేసిన చెల్లింపులు పరిశీలిస్తే.. యూపీఏ హయాం కంటే 40రెట్లు పెరిగినట్లు వివరించారు.
పండిన పంటలను ఎగుమతి చేసుకునేందుకు ఇప్పటి వరకు ఉన్నవాటికి.. అదనంగా చేర్చి 22కు పెంచుతున్నట్లు వెల్లడించారు.
కనీస మద్దతు ధర విషయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పెట్టుబడి పెట్టిన దాని కంటే అన్ని పంట ఉత్పత్తులకు కనీసంగా ఒకటిన్నర రెట్లు ఎక్కువధర దక్కుతుంది. పంట సేకరణ కూడా రైతుల చెల్లింపులతో పాటే స్థిరంగా పెరుగుతోంది. అంతేకాకుండా ఈ ఏడాది రైతుల రుణవితరణ లక్ష్యాన్ని 16.5 లక్షల కోట్ల రూపాయలకు పెంచుతున్నాం.
--- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికమంత్రి.