తెలంగాణ

telangana

By

Published : Dec 12, 2020, 5:31 AM IST

ETV Bharat / business

ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆశావహంగా సర్కార్​

రెండో త్రైమాసికంలో జీడీపీ గణాంకాలు మార్కెట్‌ అంచనాల కన్నా మెరుగ్గా ఉన్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్​ బజాజ్​ పేర్కొన్నారు. మిగతా త్రైమాసికాల్లోనూ మరింత మెరుగ్గా ఉంటాయని ఫిక్కీ వార్షిక సదస్సులో ఆయన ధీమా వ్యక్తం చేశారు.

economy
ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆశావహంగా సర్కార్​

ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై ప్రభుత్వం ఆశావహంగా ఉందని, వృద్ధిని పెంచే చర్యలను కొనసాగిస్తుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ అన్నారు. రెండో త్రైమాసికంలో జీడీపీ గణాంకాలు మార్కెట్‌ అంచనాల కన్నా మెరుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు. మిగతా త్రైమాసికాల్లోనూ మరింత మెరుగ్గా ఉంటాయని ఫిక్కీ వార్షిక సదస్సులో ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ వల్ల తొలి త్రైమాసికంలో 23.9 శాతం కుంచించుకుపోయిన ఎకానమీ రెండో త్రైమాసికానికి 7.5 శాతానికి తగ్గిన సంగతి తెలిసిందే.

"ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై మేం సానుకూలంగా ఉన్నాం. మూడు, నాలుగో త్రైమాసికాలు ఇంకా మెరుగ్గా ఉంటాయని ధీమాగా ఉన్నాం. మేమే కాదు అంతర్జాతీయ సంస్థలు, రేటింగ్‌ ఏజెన్సీలు సైతం మున్ముందు గణాంకాలు మరింత మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నాయి. వృద్ధిని ఇలాగే ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలను కొనసాగిస్తాం"

- తరుణ్ బజాజ్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి‌

2021-22లో వృద్ధిరేటు దక్షిణాసియాలో 7.2%, భారత్‌లో 8 శాతానికి వస్తుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు అంచనా వేసింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు అభివృద్ధి ఆర్థిక సంస్థ (డీఎఫ్‌ఐ)ను ఏర్పాటు అవసరమేనని తరుణ్‌ అన్నారు. రాబోయే రోజుల్లో ఈ విషయంలో మరింత పురోగతి కనిపిస్తుందని తెలిపారు.

జాతీయ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల నిధి (ఎన్‌ఐఐఎఫ్‌)లో ప్రభుత్వం రుణ వేదికను సృష్టించిందని పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో రూ.6000 కోట్లను ఇవ్వనుందని వెల్లడించారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగమూ అభివృద్ధి భారాన్ని పంచుకుంటే నిలకడైన వృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా రక్షణ రంగాల్లో గరిష్ఠంగా నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలే ఉంటాయని, మిగిలినవన్నీ ప్రైవేటీకరణ అవుతాయని గతంలో ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన విధానం త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆయన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details