తెలంగాణ

telangana

ETV Bharat / business

చైనాకు భారత్‌ షాక్‌-ఎఫ్‌డీఐ నిబంధనలు మరింత కఠినం - భారతీయ సంస్థలపై కరోనా ప్రభావం

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)ల్లో కీలక మార్పులు చేసింది కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ. కరోనా కారణంగా ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఈ నేపథ్యంలో సరిహద్దు దేశాలు, ముఖ్యంగా చైనా కంపెనీలు భారతీయ సంస్థల్లో పెట్టుబడి పెట్టాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది.

Govt approval must for all FDIs
ఎఫ్‌డీఐ నిబంధనల్లో మార్పులు

By

Published : Apr 18, 2020, 7:52 PM IST

కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్న వేళ అవకాశవాదంతో ఇతరదేశాలు భారత కంపెనీల్లో వాటాలు చేజిక్కించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను మరింత కఠినతరం చేసింది. భారత్‌తో సరిహద్దులు పంచుకునే దేశాలు, అక్కడి వ్యక్తులు, వ్యాపార సంస్థలు.. దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

చైనాకు చెక్‌..

భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది.. ప్రభుత్వ అనుమతి లేకుండా నేరుగా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం (ఆటోమేటిక్‌). ప్రభుత్వ అనుమతి తీసుకొని పెట్టడం రెండోది. ఇప్పటి వరకు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ రెండో విభాగంలో ఉండేవి. ప్రస్తుత నిబంధనలతో చైనాను రెండో విభాగంలో చేర్చారు.

అమెరికా కంపెనీల్లో చైనా సంస్థల పెట్టుబడి!

చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌తో ప్రపంచమంతా బాధపడుతోంది. లాక్‌డౌన్‌, ఆంక్షలు అమలు చేయడం వల్ల అన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇదే అదనుగా అవకాశవాదంతో భారత కంపెనీలను చేజిక్కించుకోకుండా, విలీనాలు జరగకుండా.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. హెచ్‌డీఎఫ్‌సీలో పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్ చైనా 1.01 శాతం వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన పలు కంపెనీల్లోనూ చైనా వాటాలు కొనుగోలు చేసిందని సమాచారం.

"భారత్‌తో సరిహద్దులు పంచుకొనే దేశాల్లోని కంపెనీ లేదా యజమాని, పౌరుడు స్థానిక కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి" - కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ.

నిబంధనలు ఇలా..

రక్షణ, టెలికాం, ఫార్మా సహా 17 రంగాల కంపెనీల్లో నిర్దేశిత శాతాన్ని మించి విదేశీ పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. రూ.5,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలంటే ఆ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ముందుకు తీసుకురావాలి.

రాహుల్ గాంధీ హర్షం..

ఎఫ్‌డీఐల నిబంధనల్లో మార్పుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. విదేశీ కంపెనీలు భారతీయ సంస్థలను కొనుగోలు చేయకుండా చూడాలని తాను హెచ్చరించిన విషయాన్ని పరిగణించినందుకు ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:మే 4 నుంచి ఎయిర్ ‌ఇండియా విమాన సేవలు

ABOUT THE AUTHOR

...view details