కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమందించే దిశగా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. పండుగ సీజన్లో డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) నగదు ఓచర్లును, రూ.10 వేల పండుగ అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం తెలిపారు.
డిమాండ్ పెంచడంలో భాగంగా రాష్ట్రాలకు 50 ఏళ్ల వరకు వడ్డీ లేకుండా రూ.12,000 కోట్ల రుణ సదుపాయాన్ని ప్రకటించారు.
ఎల్టీసీ ఓచర్ల వివరాలు ఇవి..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగేళ్లకు ఒక సారి విహార యాత్రలకు, సొంతూళ్లకు వెళ్లేందుకు ఎల్టీసీ తీసుకునే వీలుంటుంది. అయితే సారి ప్రయాణాలు కష్టతరమైనందున.. ఎల్టీసీకి బదులు అంతే మొత్తానికి సమానమైన పన్ను వర్తించని నగదు ఓచర్లు ఉద్యోగులకు ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
'ఉద్యోగులు ఈ ఓచర్లను ఉపయోగించి కేవలం ఆహారేతర వస్తువులు మాత్రమే కొనుక్కోవాలి. అవి కూడా 12శాతం అంతకంటే ఎక్కువ జీఎస్‌టీ అమలయ్యే వస్తువులే అయి ఉండాలి. వీటిని జీఎస్‌టీ నమోదిత అవుట్‌లెట్లలో డిజిటల్ రూపంలో మాత్రమే కొనుగోలు చేయాలి' అని సీతారామన్ తెలిపారు. ఈ ఓచర్లను 2021 మార్చి 31లోపు వినియోగించుకునేందుకు వీలుందని వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఈ ప్రయోజనాలను కల్పించొచ్చని చెప్పారు.
పండుగ అడ్వాన్స్..
ఎల్టీసీ ఓచర్‌తో పాటు ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్ కింద రూ.10 వేలు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది . ఈ మొత్తాన్ని వడ్డీ లేకుండానే ఇవ్వనున్నట్లు వెల్లడించింది.