తెలంగాణ

telangana

ETV Bharat / business

పద్దు 2021:​ కొత్తదనంతో ముందుకు ‘సాగు’ - బడ్జెట్​లో వ్యవసాయానికి ఎలాంటి నిర్ణయాలు ఉండనున్నాయి

కేంద్రం త్వరలో.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి పద్దు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. బడ్జెట్​లో వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రం నిర్ణయాలు ఎలా ఉండనున్నాయి? ఎలాంటి చర్యలు తీసుకుంటే రైతులకు మేలు జరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు?

Agri experts on Budget
బడ్జెట్​కు వ్యవసాయ రంగం సూచనలు

By

Published : Jan 26, 2021, 7:02 PM IST

Updated : Jan 27, 2021, 8:44 AM IST

ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నూతన వ్యవసాయ చట్టాలతో ఇప్పటికే రైతులు ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌-2021లో వ్యవసాయ బిల్లు ప్రభుత్వానికి కత్తిమీద సామే. కొత్త వ్యవసాయ చట్టాల్లో కీలక సవరణలు చేసి రైతులను తృప్తి పర్చడానికి ఇదో బంగారు అవకాశం. దీనితోపాటు కొన్నేళ్ల నుంచి వ్యవసాయ రంగానికి గుది బండలుగా మారిన తక్కువ ఉత్పత్తి, నాణ్యత, అదనపు విలువ జోడింపు వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు. ప్రభుత్వం కొన్ని కీలక అంశాలపై దృష్టి సారిస్తే భవిష్యత్తులో వ్యవసాయ రంగం మరింత బలోపేతం అవుతుంది.

ఉత్పత్తి పెంపుపై దృష్టి..

ప్రభుత్వం ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టాలంటే వ్యవసాయదారులను ఆయా పంటలు పండించేలా ప్రోత్సహించాలి. ఇన్‌పుట్‌ సబ్సిడీలో మార్పులు చేయాలి. ఫలితంగా రైతులు ఒకే రకమైన ఎరువులు కాకుండా.. వివిధ రకాలను వినియోగించేలా చూడాలి. ఈ చర్యలతో దీర్ఘకాలం పాటు భూములు సారవంతంగా ఉంటాయి. దీనితో పాటు మొబైల్‌ భూసార పరీక్ష కేంద్రాలకు కేటాయింపులు అవసరం. ఇది సూక్ష్మ,మధ్యతరగతి రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

దేశంలోని చాలా ప్రాంతాల్లో నీటి లభ్యత సవాలుగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో పనులు ఉండి ఉపాధి పెరగాలంటే నీటి లభ్యత తప్పనిసరి. ప్రభుత్వం ఈ సారి నీటిపారుదల సౌకర్యాలపై కూడా దృష్టిపెట్టే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి కృషి సంచాయన్‌ యోజన కింద డ్రిప్‌ ఇరిగేషన్‌కు ప్రోత్సాహకాలు పెంచాల్సి ఉంది. అంతేకాదు.. వాతావరణ మార్పుల నుంచి రైతులకు వచ్చే నష్టాలను తట్టుకొనేలా పంటల బీమాను ప్రభుత్వం మరింత పటిష్టం చేయనుంది.

క్రెడిట్‌ ఇన్సెంటీవ్‌లు..

ప్రభుత్వాలు, రైతులు దీర్ఘకాలం ఉపయోగపడే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి.. లేదా పరికరాల కొనుగోలుకు ఇన్సెంటీవ్‌లు ఇచ్చే అవకాశం ఉంది. దీనిలో ముఖ్యంగా నీటి పారుదల, వ్యవసాయ పనులకు, రవాణకు ఉపయోగపడేలా క్రెడిట్‌ గ్యారెంటీ స్కీంపై దృష్టిపెట్టినట్లు సమాచారం.

భారీ సంఖ్యలో క్లస్టర్లు..

ప్రభుత్వం వివిధ రకాల క్లస్టర్లను తయారు చేయాలనే లక్ష్యాన్ని ఈ బడ్జెట్‌లో మరింత ముందుకు తీసుకెళుతుంది. ఇప్పటికే దాదాపు 3,500 ఫార్మర్‌ ప్రమోటెడ్‌ ఆర్గనైజేషన్స్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక ఉత్పత్తికి ఒక జిల్లా వంటి పథకాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ రకంగా వివిధ ఉత్పత్తులను అనుసంధానించే అవకాశం ఉంది. బడ్జెట్‌ కేవలం నిధుల కేటాయింపులకు మాత్రమే పరిమితమైతే.. రాష్ట్రాలు వీటి అనుసంధానం బాధ్యతను చూస్తాయి. ఇప్పటికే ప్రభుత్వం మార్కెట్‌ అనుకూల వ్యవసాయ బిల్లులను చేసింది. దీనితో వచ్చే బడ్జెట్‌లో ప్రైవేటు రంగ సంస్థలు వ్యవసాయరంగానికి అవసరమైన సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది.

నాణ్యత పెంచడానికి..

వ్యవసాయ రంగంలో ఎగుమతులకు నాణ్యత అత్యంత కీలకమైంది. వివిధ దేశాలు నిర్దేశించిన నాణ్యతను అందుకోవడంలో విఫలం అయితే ఎగుమతులు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో వివిధ పంటల నాణ్యతను ప్రభుత్వం ముందు నుంచి గుర్తించి జాగ్రత్తగా అమలు చేసేలా ఓ ఏజెన్సీ ఏర్పాటుకు ప్రభుత్వం ఓ కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది రైతులకు తగిన జాగ్రత్తలు చెప్పి నాణ్యతను పెంచేలా జాగ్రత్తలు తీసుకొంటుంది. దీంతోపాటు ఆర్గానిక్‌ ఉత్పత్తులను ప్రోత్సహించడం, ప్రస్తుత వ్యవసాయ పరిశోధనశాలలను ఆధునీకీకరించడం చేయనుంది.

పరిశోధనలపై వ్యయాలు పెంపు..

భారత్‌లో ఇప్పటికీ నూనెలు, పప్పుధాన్యాలను దిగుమతి చేసుకొంటున్నారు. వీటికి సంబంధించిన ఉత్పత్తిని పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. వీటి కోసం అదనపు నిధులను సమకూర్చాలి. పశుపోషణ కూడా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చాలా అవసరం. ప్రభుత్వం పశువులకు వచ్చే వ్యాధులను నివారించడానికి అవసరమైన టీకాలను దేశీయంగా అభివృద్ధి చేయాలి. ఇది పశువుల్లో మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది.

అగ్రిటెక్‌పై దృష్టి..

సరికొత్త సాంకేతికతను వ్యవసాయ రంగంలోకి ప్రభుత్వం చొప్పించాలి. ముఖ్యంగా మార్కెట్లు, మార్కెట్ల అనుసంధానం, రైతులకు సలహాలు ఇచ్చే వ్యవస్థలు, యాంత్రీకరణ, రవాణ, శీతలీకరణ గిడ్డంగులు, కాంట్రాక్టింగ్‌ విధానాలు, కచ్చితమైన వాతావరణ సమాచారం వంటి అంశాలు భారత్‌లో మరింత బలోపేతం కావాలి. 2021 బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ రంగాలపై దృష్టిపెట్టాల్సి ఉంది. బడ్జెట్‌ కేటాయింపులు పెరిగే కొద్దీ ఈ రంగాలపై ప్రైవేటు పెట్టుబడులు కూడా పెరుగుతాయి. ఫలితంగా వ్యవసాయరంగంలో ఆధునికీకరణ సాధ్యమవుతుంది.

ఇదీ చూడండి:రూ.19 లక్షల కోట్లకు వ్యవసాయ రుణాల లక్ష్యం!

Last Updated : Jan 27, 2021, 8:44 AM IST

ABOUT THE AUTHOR

...view details