ఏదైనా సంక్షోభమొస్తే స్టాక్ మార్కెట్లు, ఇతర పెట్టుబడి సాధనాలు ఒడుదొడుకులు ఎదుర్కోవడం సర్వసాధారణం. అలాంటి సమయాల్లో బంగారం మాత్రం అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనంగా కనిపిస్తుంది. ఈ కారణంగా ఈ ఏడాది పసిడిపై పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఫలితంగా ధరలూ రికార్డు స్థాయిలను తాకాయి. అయితే వచ్చే ఏడాదీ పసిడి ధరల పరుగులు కొనసాగొచ్చని చెబుతున్నారు విశ్లేషకులు.
2021లో 10 గ్రాముల బంగారం ధర రూ.63,000 మార్క్ దాటొచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. అమెరికా డాలర్ బలహీనపడుతుండటం, ఇటీవలి ఉద్దీపన నేపథ్యంలో ఈ స్థాయిలో పసిడి ధర పెరగొచ్చని భావిస్తున్నారు.
రికార్డు స్థాయికి ధరలు
ఈ ఏడాది కరోనా వైరస్ వల్ల నెలకొన్న ప్రపంచవ్యాప్త సంక్షోభం వల్ల పసిడిపై పెట్టుబడులకు డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల పుత్తడి ధర జీవనకాల గరిష్ఠమైన రూ.56,191కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2,075 డాలర్లుగా నమోదైంది.
ప్రపంచ ద్రవ్య విధానాల్లో కీలక మార్పులు, తక్కువ వడ్డీ రేట్లు వంటివి పసిడి ధరలు 2019 మధ్యలో భారీగా పెరిగేందుకు కారణమయ్యాయి. ఈ ప్రభావం మదుపరులకు పసిడిని మరింత ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనంగా చేసింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో 2020లో దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.39,100 వద్ద, అంతర్జాతీయంగా ఔన్సుకు 1,517 డాలర్ల వద్ద ప్రారంభమైంది.
కరోనా వల్ల ఏర్పిడిన పరస్థితులతో ఈ ఏడాదే.. 10 గ్రాముల పసిడి ధర ఒకానొక దశలో రూ.38,400కి పడిపోయి.. తిరిగి రూ.56,191 వద్దకు చేరింది. పెట్టుబడులకు పోత్సాహమందించే ఉద్దీపనలు ఇందుకు కారణమైనట్లు కమెట్రెండ్జ్ రిస్క్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సీఈఓ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ పేర్కొన్నారు.
కరోనా వ్యాక్సిన్, కొవిడ్ నుంచి ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నట్లు సంకేతాలు వస్తున్నా.. రానున్న రోజుల్లో పసిడి జోరు కొనసాగొచ్చని తెలిపారు త్యాగరాజన్.