ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్య బంగారం దిగుమతులు భారీగా పుంజుకున్నాయి. రెండు నెలల్లో దాదాపు రూ.51,438.82 కోట్లు విలువైన పసిడిని భారత్ దిగుమతి చేసుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ద్వారా తెలిసింది. గత ఏడాది ఇదే సమయంలో బంగారం దిగుమతుల విలువ కేవలం రూ.599 కోట్లుగా ఉండటం గమనార్హం.
వెండి దిగుమతులు మాత్రం 2021 ఏప్రిల్-మే నెలల్లో రికార్డు స్థాయిలో 93.7 శాతం క్షీణించి.. 27.56 మిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు వాణిజ్య శాఖ పేర్కొంది. పసిడి దిగుమతులు పెరగటం వల్ల వెండి డిమాండ్ పడిపోయినట్లు వివరించింది.
పసిడి దిగుమతులు పెరిగిన నేపథ్యంలో ఏప్రిల్-మే నెలల్లో భారత వాణిజ్యలోటు 21.38 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు తెలిపింది వాణిజ్య శాఖ. గత ఏడాది ఇదే సమయంలో వాణిజ్య లోటు 9.91 బిలియన్ డాలర్లు మాత్రమేనని వెల్లడించింది.