ఆర్థిక సంవత్సరం 2018-19 వృద్ధి రేటును జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) సవరించింది. తయారీ, గనుల రంగాల క్షీణత కారణంగా 6.8 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది. ఈ మేరకు సవరించిన గణాంకాలను విడుదల చేసింది ఎన్ఎస్ఓ.
"2011-12 ధరల్లో లెక్కిస్తే వాస్తవ జీడీపీ.. 2018-19లో 139.81 లక్షల కోట్లు, 2017-18లో 131.75 లక్షల కోట్లుగా ఉంది. ఫలితంగా 2018-19లో 6.1 శాతం, 2017-18లో 7.1 శాతం పెరుగుదల నమోదైంది."
-జాతీయ గణాంకాల కార్యాలయం
తయారీ, గనుల రంగాల క్షీణత..
2019 జనవరిలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2017-18లో వాస్తవ జీడీపీ 131.80 లక్షల కోట్లతో 7.2 శాతం వృద్ధి రేటు ఉంది. దీనికి ప్రధాన కారణం వ్యవసాయం, అటవీ, మత్స్య పరిశ్రమ, గనులు, తయారీ రంగాల్లో వృద్ధి క్షీణతేనని ఎన్ఎస్ఓ స్పష్టం చేసింది.