ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) అంచనాలు తగ్గించింది ఇండియా రేటింగ్స్ అండ్ రీసర్చ్ సంస్థ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-20కిగాను జీడీపీ 6.7 శాతంగా ఉండొచ్చని తాజా నివేదికలో అంచనా వేసింది. గతంలో ప్రకటించిన నివేదికలో 7.3 శాతంగా జీడీపీ నమోదు కావొచ్చని పేర్కొంది.
వినియోగం తగ్గడం, లోటు వర్షపాతం, ఉత్పత్తి రంగంలో వృద్ధి మందగమనం అంచనాల తగ్గింపునకు ప్రధాన కారణంగా సంస్థ స్పష్టం చేసింది.
ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ 2019-20 జీడీపీ అంచనాలను 6.8 శాతం నుంచి.. 6.2 శాతానికి సవరిస్తూ ఇటీవల నివేదిక వెలువరించిన అనంతరం తాజాగా ఇండియా రేటింగ్స్ అండ్ రీసర్చ్ సంస్థ ప్రకటన వెలువడింది.
నివేదికలోని కీలక అంశాలు
- ప్రపంచ వాణిజ్య రంగంలో నెలకొన్న భయాలే వృద్ధి తగ్గుదలకు ప్రధాన కారణం.
- స్థిరాస్తి, తయారీ రంగాల్లో వినియోగ సామర్థ్యం తగ్గుదల. (2014 నుంచి 70-76 శాతం మధ్య కొట్టుమిట్టాడుతోంది).
- టోకు ధరలు, వినియోగ ధరల సూచీల ప్రకారం 2020లో ద్రవ్యోల్బణం 3.8 శాతంగా ఉండే అవకాశం.
- దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఆహారం, ముడి చమురు ధరలే కీలకంగా ఉంటున్నాయి. ఇదే పరిస్థితి 2020 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగే అవకాశం.
ఇదీ చూడండి: '2020లో భారత వృద్ధి రేటు అంచనా 7.1 శాతం'