తెలంగాణ

telangana

ETV Bharat / business

U, V కానేకాదు.. ఇది 'K-షేప్' రికవరీ! - K-shaped recovery

కరోనాతో మాంద్యంలోకి కూరుకుపోయిన దేశాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఈ ఇవేవీ సాధారణ వీ షేప్, యూ షేప్ రికవరీల ఛాయలు కాదు. ఓ వర్గం రికవరీ చెందుతుంటే మరో వర్గం మరింత సంక్షోభంలోకి కూరుకుపోతోంది. ఈ అసాధారణ పరిస్థితినే 'కే-షేప్' రికవరీగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అసలు ఈ కే-షేప్ రికవరీ అంటే ఏంటో చుద్దాం.

Forget U, V or W - experts are now talking about K-shaped recovery
యూ, వీ కానేకాదు.. ఇది 'కే-షేప్' రికవరీ!

By

Published : Sep 18, 2020, 3:46 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభంతో దేశాలన్నీ మాంద్యంలోకి కూరుకుపోయిన ప్రస్తుత సమయంలో వృద్ధి పథాన్ని అంచనా వేయడంలో నిపుణులందరూ నిమగ్నమయ్యారు. ఇప్పటివరకుయూ, వీ , డబ్ల్యూ, జడ్, ఎల్​ ఆకారపు రికవరీల గురించి చర్చించారు. ఆర్థిక వ్యవస్థలు తిరిగి పుంజుకునే తీరును బట్టి వీటిపై ఓ అంచనాకు వస్తున్నారు. అయితే తాజాగా భిన్నమైన వృద్ధి పథాన్ని గుర్తించారు ఆర్థికవేత్తలు. దీన్ని భయంకరమైన వృద్ధి పథంగా అభివర్ణిస్తున్నారు. అదే 'కే' షేప్ రికవరీ.

కే షేప్ రికవరీ అంటే?

ఆర్థిక మందగమనం వివిధ రంగాలపై అసమానంగా ఉండటాన్ని కే షేప్ రికవరీగా పేర్కొంటారు. ఇందులో భాగంగా పరిశ్రమలు, ఇతర రంగాలు లేదా ప్రజలపై మందగమన ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవస్థలోని కొన్ని రంగాలు వేగంగా పుంజుకుంటాయి. అదే సమయంలో మరికొన్ని రంగాలు నేలచూపులు చూస్తాయి. ఆయా రంగాల తీరుతెన్నులను ఓ గ్రాఫ్​పై చూపిస్తే 'K' ఆకారాన్ని ప్రతిబింబిస్తాయి.

ఉదాహరణకు... ఇంటర్నెట్, సాంకేతిక ఆధారిత పరిశ్రమలు కరోనాను తట్టుకొని వేగంగా పుంజుకుంటున్నాయి. కొవిడ్ పూర్వస్థితితో పోలిస్తే మరింత వేగంగా వృద్ధి చెందుతున్నాయి. మరోవైపు పర్యటకం, రవాణా, వినోదం, ఆతిథ్యం వంటి రంగాలు మార్చితో పోలిస్తే మరింత దిగజారుతున్నాయి.

ఆదాయ అసమానతల్లో పెరుగుదల కూడా కే-ఆకారపు సిద్ధాంతం ప్రధాన లక్షణం. ఏదైనా ఆర్థిక వ్యవస్థలో కే-ఆకారపు రికవరీ కనిపిస్తే.. సంపన్నుల పరిస్థితి మరింత మెరుగవుతుందని, పేదవారి పరిస్థితి మరింత అధ్వానంగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు, స్టాక్ మార్కెట్ల పోకడలకు ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరిస్థితికి మధ్య విభేదాలు పెరగడం కూడా కే ఆకారపు రికవరీని సూచిస్తుంది. ప్రస్తుతం అభివృద్ధి చెందిన ప్రధాన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆయా దేశాల జీడీపీ వృద్ధి ప్రతికూల పథంలో పడిపోయింది.

దీన్ని ఎవరు గుర్తించారు?

కే ఆకారపు రికవరీ సిద్ధాంతాన్ని రూపొందించిన ఘనత పీటర్ ఎట్వాటర్​దే. వర్జీనియాలోని విలియం అండ్ మేరీ విశ్వవిద్యాలయంలో లెక్చరర్​గా ఆయన సేవలందిస్తున్నారు.

"నేను దీన్ని కే-ఆకారపు రికవరీగా పిలుస్తున్నాను. ఎందుకంటే కొందరికి ఇది వేగంగా వృద్ధి చెందే స్థితి అయితే... మరికొందరికి నిరంతర క్షీణత. సంపన్నులు స్పష్టంగా పుంజుకుంటున్నారు. కరోనా ప్రభావం పడిన చాలా వరకు చిన్న వ్యాపారాల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఒక వర్గం గతంలో కంటే మెరుగ్గా ఉంది. మరో వర్గం నిరాశజనకంగా ఉంది."

-పీటర్ ఎట్వాటర్, కే-ఆకారపు రికవరీ సిద్ధాంతకర్త

ట్రంప్​ నిర్వాకం వల్లే: బైడెన్

అమెరికాలో రాజకీయ వర్గాల దృష్టినీ ఈ విషయం ఆకర్షించింది. అసాధారణమైన కే-ఆకారపు రికవరీని సృష్టించారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా ఈ నెల మొదట్లో విమర్శనాస్త్రాలు సంధించారు డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్. ట్రంప్ అధ్యక్ష హయాంలో జరిగిన తప్పులను నిర్వచించే అద్భుతమైన పదబంధమే కే-ఆకారపు మాంద్యం అని వ్యాఖ్యానించారు.

మరోవైపు యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలు సుజెన్ క్లార్క్ కే-షేప్ రికవరీపై ఓ వ్యాసం రాశారు. వీ షేప్​ రికవరీకి విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయని, పలు రంగాలు శక్తిమంతంగా మారితే మరికొన్ని దిగజారుతున్నాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి-వేతన జీవులపై కరోనా పిడుగు- 66 లక్షల ఉద్యోగాలు కోత!

ABOUT THE AUTHOR

...view details