తెలంగాణ

telangana

కరోనా ప్యాకేజ్ 3.0​లో సాగు, మత్స్య రంగాలకు పెద్దపీట

By

Published : May 15, 2020, 3:55 PM IST

Updated : May 15, 2020, 6:00 PM IST

Finance Minister Nirmala Sitharaman on Friday will announce the 3rd tranche of economic package at 4 PM.

fm
ప్యాకేజ్​ రౌండ్-3: మత్స్య రంగం, మౌలిక సదుపాయలపై దృష్టి​

17:15 May 15

కరోనా ప్యాకేజ్​ రౌండ్​-3 హైలైట్స్​

  1. రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి నిధి ఏర్పాటు. శీతల గిడ్డంగులు, మార్కెట్ యార్డుల నిర్మాణంపై దృష్టి.
  2. మైక్రో ఫుడ్​ ఎంటర్​ప్రైజెస్​ కోసం రూ.10 వేల కోట్లతో కొత్త పథకం. ఈ చర్యతో ఆహార నాణ్యత మెరుగుదల, రిటైల్​ మార్కెట్​తో అనుసంధానం, ఆదాయంలో వృద్ధి.
  3. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్య రంగానికి రూ.20 వేల కోట్లు. చేపల ఉత్పత్తి, ఎగుమతులు పెంచేలా మౌలిక వసతుల అభివృద్ధి.
  4. రూ.13,343 కోట్లతో జాతీయ పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమం అమలు. 53 కోట్ల పశువుల్లో గాళ్ల వ్యాధి(ఎఫ్​ఎండీ) నివారణే లక్ష్యం.
  5. డెయిరీ ప్రాసెసింగ్​లో పెట్టుబడులు ప్రోత్సహించేందుకు రూ.15 వేల కోట్లతో పశు సంవర్థక మౌలిక వసతుల అభివృద్ధి నిధి ఏర్పాటు.
  6. ఔషధ విలువలు కలిగిన మొక్కల పెంపకం ప్రోత్సహించేందుకు రూ.4 వేల కోట్లు కేటాయింపు. రానున్న రెండేళ్లలో 10 లక్షల హెక్టార్లలో సాగు చేయించడమే లక్ష్యం.
  7. తేనెటీగల పెంపకం ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లు ఖర్చు. గ్రామాల్లోని 2 లక్షల మందికి లబ్ధి.
  8. అన్ని పళ్లు, కూరగాయలకు 'ఆపరేషన్​ గ్రీన్స్​' పథకం వర్తింపచేసేందుకు అదనంగా రూ.500 కోట్లు. రవాణా, నిల్వపై 50 శాతం రాయితీ.
  9. నిత్యావసరాల చట్ట సవరణకు కేంద్రం నిర్ణయం. చట్టం పరిధి నుంచి పప్పులు, ధాన్యాలు, వంట నూనెలు, ఉల్లి, ఆలూ తొలగింపు.
  10. రైతులు నచ్చిన చోట ఉత్పత్తులను అమ్ముకునేలా వ్యవసాయ మార్కెటింగ్​ విధానంలో సంస్కరణలు.
  11. పంట ఉత్పత్తుల నాణ్యత పెంచి, రైతులకు మెరుగైన ధర లభించేలా నూతన వ్యవస్థ అభివృద్ధి.

16:53 May 15

వ్యవసాయ మార్కెటింగ్​లో సంస్కరణలు...

రైతులకు మరింత వెసులుబాటు కల్పించేలా వ్యవసాయ మార్కెటింగ్​లో సంస్కరణలు. ప్రస్తుతం ఏపీఎమ్​సీలకు మాత్రమే రైతులు అమ్మాల్సిన పరిస్థితి ఉంది. ఇక నచ్చిన ధరకు ఉత్పత్తులను అమ్ముకునేందుకు రైతులకు వీలు కల్పిస్తాం. రాష్ట్రాల మధ్య రవాణాకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతాం. ఈ-ట్రేడింగ్ వ్యవస్థను రూపొందిస్తాం. వ్యవసాయ ఉత్పత్తి ధర, నాణ్యతకు భరోసా ఇస్తున్నాం. - నిర్మలా సీతారామన్​

16:51 May 15

రైతులకు మెరుగైన ధర దక్కేలా చూసేందుకు నిత్యావసరాల చట్టానికి సవరణలు చేస్తాం. పప్పులు, వంట నూనెలు, ఉల్లి, ఆలూ ధరలపై నియంత్రణ ఎత్తివేస్తాం. మహా విపత్తులు వచ్చినప్పుడే నిల్వలపై ఆంక్షలు విధింపు అమల్లో ఉంటుంది. - నిర్మలా సీతారామన్​ 

16:49 May 15

'టాప్​ టు టోటల్​' పథకానికి అదనంగా రూ.500 కోట్లు. -నిర్మలా సీతారామన్​

16:42 May 15

తేనెటీగల పెంపకానికి...

తేనెటీగల పెంపకానికి రూ.500 కోట్లు కేటాయిస్తున్నాం. దీని ద్వారా 2 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. - నిర్మలా సీతారామన్​

16:40 May 15

ఔషధ మొక్కల పెంపకానికి...

ఔషధ విలువలున్న మొక్కల పెంపకానికి రూ.4 వేల కోట్లు. రానున్న రెండేళ్లలో 10 లక్షల హెక్టార్లలో సాగు చేస్తాం. - నిర్మలా సీతారామన్​

16:36 May 15

పశు సంవర్థక రంగానికి...

"రూ.15 వేల కోట్లతో పశు సంవర్థక రంగ మౌలిక వసతుల అభివృద్ధి నిధి ఏర్పాటు. పాడి పరిశ్రమలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రయత్నం చేస్తున్నాం." - నిర్మలా సీతారామన్​

16:34 May 15

పశు సంవర్థక శాఖకు...

ఇప్పటికే రూ.13,343 కోట్లతో జాతీయ పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమం ప్రారంభించాం. దేశంలోని 53 కోట్ల పశువులను రక్షించేలా టీకాలు. ఇప్పటివరకు కోటిన్నర ఆవులు, గేదెలకు ట్యాగింగ్, టీకాలు వేయడం పూర్తి చేశాం. లాక్​డౌన్​ ఉన్నా గ్రీన్​జోన్​లో ఈ కార్యక్రమం అమలు చేశాం, - నిర్మలా సీతారామన్​ 

16:29 May 15

మత్స్య రంగానికి...

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్యకారులకు రూ.20 వేల కోట్లు. ఆక్వాకల్చర్​ కోసం 11 వేల కోట్లు. మౌలిక వసతుల కోసం 9 వేల కోట్లు కేటాయింపు. మౌలిక వసతుల కోసం 9 వేల కోట్లు.ఈ చర్యలతో రానున్న ఐదేళ్లలో అదనంగా 70 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి పెరుగుతుంది. 55 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. ఎగుమతుల విలువ లక్ష కోట్లకు రెట్టింపు అవు - నిర్మలా సీతారామన్​

16:28 May 15

మైక్రో ఫుడ్​ ఎంటర్​ప్రైజెస్​కు...

మైక్రో ఫుడ్​ ఎంటర్​ప్రైజెస్​ కోసం 10 వేల కోట్ల నిధి. క్లస్టర్​ ఆధారిత విధానంలో అమలు చేస్తాం. - నిర్మలా సీతారమన్​

16:21 May 15

వ్యవసాయం రంగానికి...

"వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు. ఈ నిధి సాధ్యమైనంత త్వరలో ఏర్పాటు. అగ్రిగేటర్లు, కో-ఆప్​లు ద్వారా అందజేత. కోల్డ్ స్టోరేజ్​లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి, ప్రైవేటు సంస్థలు, స్టార్టప్​ల కోసం కేటాయింపు. ప్రధాని చెప్పిన 'వోకల్ ఫర్‌ లోకల్'‌ను సాకారం చేసే దిశగా ఈ కేటాయింపులు. స్థానికంగా ఉన్న ప్రత్యేక ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ కల్పిస్తాం." - నిర్మలా సీతారామన్​

16:17 May 15

"గడిచిన రెండు నెలల్లో ఫసల్‌ బీమా యోజన కింద రూ. 6400 కోట్లు పరిహారం ఇచ్చాం. రూ. 74,300 కోట్లు మేర కనీస మద్దతు ధరల ప్రకారం కొనుగోళ్లు చేశాం. పాలసేకరణ రంగం దేశంలో ప్రస్తుతం సంక్షోభం ఎదుర్కొంటోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడిన మిగులు పాలను సహకార డెయిరీల ద్వారా సేకరించాం. ఆ మేరకు 4వేల 100 కోట్ల రూపాయల మేర రైతులకు ప్రయోజనం చేకూర్చాం." - నిర్మలా సీతారామన్​

16:10 May 15

వ్యవసాయం, అనుబంధ రంగాలకు 11 చర్యలు ప్రకటిస్తున్నట్లు నిర్మల తెలిపారు. మౌలిక వసతుల బలోపేతం, నిల్వ సామర్థ్యం పెంపు.. పరిపాలనాపరమైన సంస్కరణలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

16:07 May 15

వ్యవసాయ రంగం...

ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ మూడో విడత ప్యాకేజీ ప్రకటిస్తున్న నిర్మలా సీతారామన్​. వ్యవసాయం, అనుబంధ రంగాలపై ప్యాకేజీ ఉంటుందని స్పష్టం. మత్స్య, డెయిరీ పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉత్పత్తులకు సాయమిస్తామని హామీ.

15:42 May 15

ప్యాకేజ్​ రౌండ్-3: మత్స్య రంగం, మౌలిక సదుపాయలపై దృష్టి​

లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్ధకు ఊతమిచ్చేందుకు రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. వరుసగా మూడో రోజు ఆ వివరాలను వెల్లడించనుంది. ఇప్పటికే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వలస కార్మికులు సహా వివిధ వర్గాలకు అందించబోయే సాయం వివరాలను ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. ఇవాళ మరిన్ని రంగాలకు సంబంధించిన ఉద్దీపన చర్యల్ని తెలియచేయనున్నారు.

మత్స్య రంగంపై దృష్టి

పశుసంవర్ధక, మత్స్య రంగానికి ప్రోత్సాహం, ఉపశమనం లభించే విధంగా ఆర్థికమంత్రి ఇవాళ వివరాలు వెల్లడించవచ్చని తెలుస్తోంది. ఆయా రంగాల్లో సమస్యలపై కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌తో ఇప్పటికే పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు నిర్మల.

లాక్‌డౌన్‌ కారణంగా మత్స్య, అనుబంధ రంగాల్లో 15లక్షల మంది ప్రభావితమైనట్లు సమాచారం. దేశీయ మార్కెట్లో అమ్మకాలు తగ్గడం, ఎగుమతికి ఆస్కారం లేనందున కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసినట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలకు ఊరట కల్పించేలా ఆర్థిక మంత్రి ఇవాళ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.

మౌలికానికి ప్రాధాన్యం

మౌలిక సదుపాయాల రంగానికి ఊతమిచ్చేలా ఆర్థికమంత్రి ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 2019-20 నుంచి 2024-25 వరకు రూ.111 లక్షల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదివరకే ఈ ప్రకటన చేసిన ప్రభుత్వం.. దీనికి సంబంధించిన తొలి దశ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాలకు సంబంధించిన కొత్త ఆర్థిక సంస్థను రూపొందిస్తున్నట్లు ప్రకటించవచ్చని సమాచారం.

వీటితో పాటు హోటళ్లు, విమానయాన సంస్థలు, పర్యాటక రంగానికి సాయం అందించేలా కూడా ఆర్థిక మంత్రి ప్రకటన చేయనున్నట్లు సమాచారం. విమాన ల్యాండింగ్, టేకాఫ్ ఛార్జీ తగ్గింపుపై ప్రకటన చేయవచ్చని అంచనా.

Last Updated : May 15, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details