కరోనా లాక్డౌన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం పుంజుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు మైనస్ లేదా సున్నాకు దగ్గరగా ఉండొచ్చని అంచనా వేశారు. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ఏర్పడిన 23.9 శాతం లోటే ఇందుకు కారణమని తెలిపారు. ఈ మేరకు దిల్లీలోని ఇండియా ఎనర్జీ ఫోరం 'సెరా వీక్' (సీఈఆర్ఏడబ్ల్యూఈఈకే) లో మాట్లాడారు.
కరోనా మహమ్మారిని అదుపుచేయడంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది. దాని పర్యవసానంగా మొదటి త్రైమాసికంలో 23.9శాతం లోటు ఏర్పడింది. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి సూచీలు ఆశాజనకంగా ఉన్నాయి. పండుగ సీజన్ల కారణంగా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది. మూడు, నాలుగవ త్రైమాసికాల ఫలితాలు సానుకూలంగా ఉంటాయని ఆశిస్తున్నాం. ఆర్థిక కార్యకలాపాలను, ప్రజల కొనుగోలు స్థాయిని పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.