కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్రం మరోసారి ఉద్దీపన చర్యలకు ఉపక్రమించింది. వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు, కొవిడ్‌తో కుదేలైన రంగాలకు అండగా నిలిచేందుకు రూ.1.1 లక్షల కోట్లతో ప్రత్యేక రుణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు. ఇందులో అత్యధికంగా వైద్య, ఆరోగ్య రంగానికి రూ.50 వేల కోట్లు, ఇతర రంగాలకు రూ.60 వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
చిన్న సంస్థలకు మరింత అండ..
చిన్న సంస్థలను ఆదుకునేందుకు ఇదివరకే ప్రకటించిన.. ఎమర్జెన్సీ క్రెడిట్ గ్యారంటీ స్కీం (ఈసీజీఎస్) పథకం పరిమితిని రూ.4.5 లక్షల కోట్లకు (అదనంగా 1.5 లక్షల కోట్లు) పెంచుతున్నట్లు వెల్లడించారు సీతారామన్.
ఈసీఎల్‌జీఎస్‌లో భాగంగా సూక్ష్మ రుణ సంస్థల ద్వారా 25 లక్షల మందికి రూ.1.25 లక్షల చొప్పున రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ రుణాలపై వడ్డీ గరిష్ఠంగా ఎంసీఎల్ఆర్పై 2 శాతం అధికంగా ఉండనున్నట్లు తెలిపింది. ఈ రుణాల కాలవ్యవధి మూడు సంవత్సరాలని వెల్లడించింది. ఈ పథకం ద్వారా రుణాల మంజూరుకు.. చివరి తేదీ సెప్టెంబర్ 30, రుణాలను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు తుది గడువును డిసెంబర్ 31గా నిర్ణయించింది ఆర్థిక శాఖ.