దేశంలో ఆర్థిక మందగమనం కొనసాగుతున్న వేళ 2019-20 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు మరింత దిగజారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రముఖ రేటింగ్స్ సంస్థ ఫిచ్ 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు అంచనాను 4.6 శాతానికి తగ్గించింది. గతంలో 5.6 శాతంగా ఉంటుందని ఈ సంస్థ అంచనా వేసింది. మరో రేటింగ్స్ సంస్థ మూడీస్ 4.9 శాతంగా అంచనా వేయగా.. ఆసియా అభివృద్ధి బ్యాంకు 5.1 శాతంగా ఉంటుందని పేర్కొంది.
రిజర్వు బ్యాంకు అక్టోబర్‌లో 6.1 శాతంగా అంచనా వేసినప్పటికీ, ఇటీవల 5 శాతానికి తగ్గుతుందని ప్రకటించింది. తాజాగా 'ఫిచ్' అంచనాలు మరింత తగ్గాయి. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నుంచి రుణ లభ్యత తగ్గడం, వాణిజ్యం మరింత క్షీణించడం వంటి కారణాలతో భారత వృద్ధిరేటు అంచనాలను తగ్గించినట్లు ఫిచ్ వెల్లడించింది.