ఆర్థిక విషయాల పట్ల మహిళలు సాధారణంగానే చాలా జాగ్రత్తగా ఉంటారు. పూర్తి అవగాహన అనంతరమే నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి వారు ఆర్థిక అంశాలు మెరుగ్గా నిర్వహించగలరు. అయితే పెళ్లి అనంతరం మాతృత్వ బాధ్యతలు నిర్వహించటం లేదా పెద్ద వారిని చూసుకోవటం తదితర బాధ్యతలు ఉండటం వల్ల మహిళలు సాధారణంగా తమ కెరీర్ లో విరామాలు తీసుకుంటుంటారు. కాబట్టి ఆర్థిక అంశాల పట్ల అవగాహన పెంచుకోవటం చాలా కీలకం.
అందరు మహిళలకు ఆర్థిక అవసరాలు ఒకే రకంగా ఉండవు. 20 ఏళ్ల మహిళ, పిల్లలు, కుటుంబం ఉన్న మహిళ, పిల్లలున్న ఒంటరి మహిళలకు ఇలా వేరు వేరు మహిళలకు ఆర్థిక అవసరాలు వేరుగా ఉండాయి. అందుకే వారందరికి పెట్టుబడి, ఆర్థిక సూత్రాలు కూడా భిన్నంగా ఉంటాయి.
40 ఏళ్ల వయస్సుతో పోల్చితే 20 ఏళ్ల వయస్సులో ఎక్కువ రిస్కు తీసుకునేందుకు వీలుంటుంది. ఎంత తక్కువ వయస్సులో పెట్టుబడి ప్రారంభిస్తే అంత మంచిది.
ఒంటరి అవివాహిత..
20 ఏళ్ల వయస్సులోనే ఉద్యోగం ప్రారంభించినట్లయితే.. అప్పటి నుంచే పెట్టుబడి పెట్టటం ప్రారంభించాలి. స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. సిప్ ద్వారా దీర్ఘకాలంలో సంపద సృష్టించుకోవచ్చు. ఆరోగ్య బీమా అనేది చాలా ముఖ్యం.
అత్యవసర పరిస్థితి ఎప్పుడైనా తలెత్తవచ్చు కాబట్టి లిక్విడ్ ఫండ్లతో కూడిన అత్యవసర నిధిని సమకూర్చుకోవాలి.
స్వల్ప కాల లక్ష్యాల కోసం డెట్ ఫండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు తదితరాలను ఆశ్రయించవచ్చు. రిటైర్మెంట్ సేవింగ్స్, ఫెన్షన్ ప్లాన్‌కు చెల్లించే మొత్తం పెంచుకోవటం, ఆరోగ్య బీమాకు టాప్అప్ తీసుకోవటం లాంటి వాటిని వయస్సు పెరుగుతున్న కొద్దీ చేయాలని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఉద్యోగం చేస్తున్న వివాహిత
ఉద్యోగం చేస్తున్న వివాహిత ఇంట్లో పనులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారి కుటుంబంలో భర్త ఆదాయానికి మహిళ ఆదాయం తోడవుతుంది. పిల్లల చదువులు, వారి పెళ్లి, రిటైర్మెంట్, ఇళ్లు కొనుగోలు చేయటం లాంటి వాటికి వీరు ప్రణాళిక వేసుకోవాలి.