ఇప్పటి పిల్లలు.. అంతర్జాలాన్ని అవలీలగా వాడగలరు.. ఎంతటి స్మార్ట్ఫోన్ అయినా వారి చేతిలో చెప్పినట్లు వినాల్సిందే.. ఏ కొత్త విషయమైన ఇట్టే నేర్చుకుంటూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మరి ఈ ఆసక్తి డబ్బు విషయంలోనూ ఉందా? అనుమానమే కదూ! అన్ని విషయాల్లోనూ కనిపించే ఆసక్తిని చూసి మురిసిపోయే తల్లిదండ్రులు కూడా పిల్లలకు డబ్బు విషయాలు చెప్పడానికి మాత్రం వెనకడగు వేస్తారు. పిల్లల భవిష్యత్తుకు విద్య ఎంత ముఖ్యమో.. ఆర్థిక విజ్ఞానం కూడా అంతే అవసరం అని గమనించాలి. అప్పుడే వారు అన్నింటా విజయం సాధించగలరు. పిల్లలు ఏదైనా సరే.. స్వతహాగా నేర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. డబ్బు విషయం కూడా అంతే. కేవలం మాటలతో చెబితే వారికి ఏమాత్రం అర్థం కాదు. డబ్బుతో ముడిపడిన చిన్న చిన్న పనులు వారితోనే చేయించాలి. రూ.10, రూ.20 నోట్లను, కొన్ని నాణేలను వారి చేతికి ఇచ్చి చిన్న చిన్న ఖర్చులకు చెల్లింపులు జరిపేలా చూడాలి. ఉదాహరణకు మీరు కిరాణా దుకాణానికి వెళ్తే.. అక్కడ అయిన ఖర్చును పిల్లలకు చెప్పి, అంత మొత్తమే ఇవ్వాలని చెప్పాలి. ఏదైనా వస్తువు కొనేముందు దాని ధరను ఎక్కడ ముద్రించి ఉంటుందో చూపించాలి. దానివల్ల వారికి డబ్బు ఎలా ఖర్చవుతుందో తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల వారికి డబ్బును ఖర్చు చేసే పద్ధతి తెలియడం సహా.. డబ్బు లెక్కలూ సులభంగా అర్థం అవుతాయి.
పొదుపు నేర్పుదాం!
డబ్బంటే ఖర్చులు ఒక్కటే కాదు కదా! పిల్లలకు పొదుపు చేయడమూ నేర్పాలి. ఖర్చు చేస్తున్నప్పుడు ఎంత డబ్బు మిగిల్చారో ఆ మొత్తాన్ని వారికి కేటాయించిన డిబ్బీలో వేసుకునేలా ప్రోత్సహించాలి. చిన్నతనం నుంచే అంటే ముచ్చటగా మూడేళ్ల వయసు నుంచి పొదుపు గురించి తెలిపే ప్రయత్నం జరగాలి. వయసు పెరుగుతున్న కొద్దీ చేతికి కొంత సొమ్ము ఇస్తూ.. అందులో కొంత ఖర్చు పెట్టుకునేలా, కొంత మిగిల్చుకుని దాచుకునేలా అలవాటు చేయాలి.
బ్యాంకులు తోడుగా..
పిల్లల కోసం బ్యాంకులు ప్రత్యేకంగా ఖాతాలను అందిస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకులతోపాటు, ప్రైవేటు బ్యాంకులు కూడా ఈ ఖాతాలను అందిస్తున్నాయి. అయితే, ఇందులో రెండు రకాల ఖాతాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని బ్యాంకులు పిల్లల వయసుతో నిమిత్తం లేకుండా ఖాతాలను అందిస్తున్నాయి. ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు తదితర బ్యాంకుల్లో పదేళ్లలోపు పిల్లలకు కూడా ఖాతాలు ప్రారంభించే వెసులుబాటు ఉంది. 10 ఏళ్ల వయసు దాటి 18 ఏళ్లలోపు ఉన్నవారికి దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ ఖాతాలను ప్రారంభించే వెసులుబాటు ఉంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కిడ్స్ అడ్వాంటేజీ అకౌంట్; ఐసీఐసీఐ బ్యాంకు యంగ్ స్టార్స్ అకౌంట్; కొటక్ మహీంద్రా మై జూనియర్ అకౌంట్; యాక్సిస్ బ్యాంకు ఫ్యూచర్ స్టార్ సేవింగ్స్ అకౌంట్; ఐడీబీఐ బ్యాంకు పవర్ కిడ్స్ పేర్లతో ఖాతాలను అందిస్తున్నాయి. పేర్లు వేరైనా ఈ ఖాతాల పనితీరు అంతా ఒకే రీతిన ఉంటుంది. డెబిట్ కార్డు, చెక్కుబుక్కులను కూడా ఇస్తారు. అయితే, తల్లిదండ్రుల అనుమతి, పర్యవేక్షణ తప్పనిసరి. కనీస నిల్వ బ్యాంకులను బట్టి రూ.1,500 నుంచి రూ.5వేల వరకూ ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకుల్లో రూ.250 నుంచి రూ.500 వరకూ కనీస నిల్వ ఉంటుంది.
మీకు వీలున్న బ్యాంకులో ఖాతా పిల్లల పేరుమీద ఖాతా ప్రారంభించండి. కొన్ని బ్యాంకులు పిల్లల ఖాతాలు ప్రారంభించగానే అందమైన కిడ్డీ బ్యాంకును అందిస్తాయి. ఆంధ్రాబ్యాంకు ఇందుకు ఉదాహరణ. దీనికి రహస్య తాళం ఉంటుంది. బ్యాంకు శాఖలోనే దీన్ని తెరవాలి.
ప్రతి నెలా నిర్ణీత తేదీ నాడు ఖాతా ఉన్న బ్యాంకుకు మీ పిల్లలను తీసుకెళ్లి అప్పటివరకూ వారు దాచుకున్న మొత్తాన్ని ఖాతాలో జమ చేసేలా చూడాలి. దీనివల్ల బ్యాంకు గురించి అవగాహన పిల్లలకు పెంచినవారమవుతాం. డబ్బు దాచుకునేందుకు పిల్లలను కూడా ఉత్సాహం వస్తుంది.
పిల్లల ఖాతా కేవలం పొదుపుకే పరిమితం కాకుండా.. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా బీమా రక్షణ కల్పిస్తుంది. ప్రమాద, జీవిత బీమా ధీమానిస్తుంది. ఖాతాలు ప్రారంభించేందుకు ముందుగా ఈ విషయాన్ని చూసుకోండి.
ప్రోత్సాహాలు అందించండి..
పెరిగే పిల్లలకు స్వతహాగా సంపాదించాలి అనే ఆలోచన కల్పించాలి. దీనికోసం వారికి చిన్న చిన్న పనులు అప్పగించి, వాటిని పూర్తి చేసిన తర్వాత కొంత మొత్తం ఇవ్వండి. ఇది మరీ ఎక్కువగా ఉండకూడదు. పని చేస్తేనే డబ్బులు వస్తాయి అనే జ్ఞానం కల్పించడమే లక్ష్యంగా ఇది సాగాలి. చేసిన పని ప్రాధాన్యాన్ని బట్టి డబ్బు ఇవ్వండి. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం. మీ పిల్లలు ఈ పని చేస్తే ఇన్ని డబ్బులు ఇస్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందే చెప్పకండి. కేవలం వారు ఆ పని చేసినందుకు మెచ్చుకోలుగా మాత్రమే మీరిచ్చే సొమ్ము ఉండాలి. పదేళ్లు దాటిన పిల్లలకు వారి అవసరాలకు ఎంత మొత్తం అవుతుందో లెక్క చూసుకోమని చెప్పాలి. ఆ మొత్తాన్ని అందించడం ద్వారా వారు వృథా ఖర్చులు చేయకుండా అడ్డుకట్ట వేయవచ్చు.