రూపే కార్డులు, బీమ్-యూపీఐ ఉపయోగించి చేసిన డిజిటల్ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీలను.. తిరిగి వినియోగదారులకు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ బ్యాంకులకు సూచించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి వసూలు చేసిన ఛార్జీలను తక్షణమే చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదివారం ఓ సర్క్యులర్ విడుదల చేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 269 ఎస్‌యూను అనుసరించి ఈ డిజిటల్ లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలను వసూలు చేయకూడదని పేర్కొంది.
ఆ ఛార్జీలను తిరిగి చెల్లించాలని బ్యాంక్‌లకు సూచనలు! - business news
ఎలక్ట్రానిక్ చెల్లింపుల విషయంలో బ్యాంకులకు కీలక సూచనలు చేసింది కేంద్ర ఆర్థికశాఖ. ఈ తరహా లావాదేవీలపై ఎటువంటి రుసుములు వసూలు చేయరాదని స్పష్టం చేసింది.
డిజిటల్ లావాదేవీల పెంపు, నగదు రహిత ఆర్థిక వ్యవస్థను రూపొందించేందుకు గాను ఫైనాన్స్ యాక్ట్, 2019లో కేంద్రం ఈ సెక్షన్‌ను చేర్చింది. రూపే డెబిట్ కార్డు, బీమ్- యూపీఐ, యూపీఐ క్యూఆర్ కోడ్‌లను నిర్దేశిత ఎలక్ట్రానిక్ వ్యవస్థల కింద నోటిఫై చేసింది. కాబట్టి ఈ రూపంలో పేమెంట్స్ చేసిన వారికి వెంటనే వసూలు చేసిన ఛార్జీలను చెల్లించాలని సీబీడీటీ బ్యాంకులకు సూచించింది.
అలాగే, వీటికి ఎలాంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వర్తించబోదని స్పష్టంచేసింది. నిర్దేశించిన లావాదేవీలు దాటిన తర్వాత యూపీఐ పేమెంట్స్‌పై.. కొన్ని బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు సీబీడీటీ దృష్టికి రావడం వల్ల ఈ సర్క్యులర్ విడుదల చేసింది.