ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది. వృద్ధి మందగమనాన్ని పారదోలి, ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించే లక్ష్యంతో బహుముఖ వ్యూహాన్ని రూపకల్పన చేసింది. సంస్కరణలు కొనసాగిస్తూ, మదుపర్లను ప్రోత్సహిస్తూ రూపొందించిన ఈ ప్రణాళికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిల్లీలో ప్రకటించారు.
'భారత్ పరిస్థితి ఎంతో మెరుగు'
మాంద్యం భయాలతో తీవ్ర ఆందోళన చెందుతున్న మదుపర్లలో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు నిర్మల. ఇతర దేశాలతో పోల్చితే భారత్ పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని స్పష్టంచేశారు.
'సంస్కరణల రథం ఆగదు...'
కేంద్ర ప్రభుత్వం సంస్కరణలే ప్రధాన అజెండాగా పనిచేస్తుందని స్పష్టంచేశారు నిర్మల. వృద్ధికి ఊతమిచ్చేలా మున్ముందు మరిన్ని సంస్కరణలు అమలుచేస్తామని చెప్పారు.
కీలక నిర్ణయాలు...
ప్రగతి ప్రయాణంలో కీలకమైన సంపద సృష్టికర్తలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని స్పష్టంచేశారు నిర్మల. వారిని దృష్టిలో ఉంచుకునే బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్లు వివరించారు.
మదుపర్లు, వ్యాపార వర్గాలకు ప్రోత్సాహం అందించేలా కీలక నిర్ణయాలు ప్రకటించారు నిర్మల. విదేశీ సంస్థాగత మదుపర్లపై అదనపు సర్ఛార్ను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. బడ్జెట్‌కు ముందు ఉన్న నిబంధనలే అమల్లో ఉంటాయని తేల్చిచెప్పారు.
మరికొన్ని కీలక అంశాలు...
- పన్ను చెల్లింపుదారులకు వేధింపులు లేకుండా చర్యలు. ఇకపై పన్ను నోటీసులన్నీ కేంద్రీకృత వ్యవస్థ ద్వారానే జారీ.
- పాత పన్ను నోటీసులు అన్నింటిపై అక్టోబర్ 1 నాటికి నిర్ణయం. కేంద్రీకృత వ్యవస్థ ద్వారా తిరిగి అప్లోడ్.
- ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల మూలధనం. తద్వారా మార్కెట్లోకి అందుబాటులోకి రానున్న రూ.5లక్షల కోట్ల నగదు.
- ఆర్బీఐ తగ్గించిన వడ్డీరేటును వినియోగదారులకు బదిలీ చేయాలని బ్యాంకుల నిర్ణయం.
- తగ్గనున్న గృహ, వాహన రుణాల భారం.
వృద్ధికి ఊతమిచ్చేలా వచ్చేవారం మరిన్ని ప్రకటనలు చేయనున్నట్లు తెలిపారు నిర్మల.