‘పన్నులు తగ్గితే బాగుండు.. విద్యా వ్యవస్థలో కొన్ని మార్పుల రావాలి.. విదేశాలకు వెళ్లి చదవాలంటే ప్రభుత్వం కొన్ని సౌలభ్యాలు కల్పిస్తే సౌకర్యవంతంగా ఉంటుంది.. ప్రాణాలు పోతున్నాయి, ఈ కాలుష్యంపై ప్రభుత్వం కాస్త దృష్టిసారిస్తే బాగుంటుంది..’ ఇలా సామాన్య ప్రజల నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వరకు ఆలోచించే అంశాలు. వీటన్నింటికీ ఒకే సమాధానం 'బడ్జెట్'. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్-2020ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా భవిష్యత్తులో అభివృద్ధి చేయాల్సిన రంగాలు.. వాటికి కల్పించాల్సిన మౌలిక వసతులు, కేటాయింపులను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వాటిలో కొన్ని రంగాలకు సంబంధించిన కేటాయింపులు, భవిష్యత్ కార్యాచరణ, వాటి అభివృద్ధి తదితర అంశాలను క్లుప్తంగా చూద్దాం...
భారత్ గమ్యస్థానం కావాలి..
- ఉన్నత విద్యలో ప్రపంచ దేశాలకు భారత్ గమ్యస్థానం కావాలి.
- స్టడీ ఇన్ ఇండియా’ ప్రాజెక్టులో భాగంగా ఆసియా, ఆఫ్రికన్ దేశాల్లో ‘ఇండ్‌శాట్’ కార్యక్రమ నిర్వహణ.
- భారత్‌లోని ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతూ ఉపకార వేతనాలు పొందాలనుకునే విదేశీ విద్యార్థులకు విధానాల రూపకల్పన.
2024 నాటికి 1200కు ఆ సంఖ్య..
- ఉడాన్ పథకంలో భాగంగా 2024 నాటికి దేశవ్యాప్తంగా 100 విమానాశ్రయాల అభివృద్ధి.
- అంతర్జాతీయ సగటుతో పోల్చితే భారత్‌లో తక్కుక వ్యవధిలోనే విమాన సర్వీసులు పెరిగాయి.
- 2024 నాటికి విమానాల సంఖ్య 600 నుంచి 1200కు చేరనుందని అంచన.
డిజిటల్ భారత్‌కు ఊతమిచ్చేలా నవ ఆర్థిక వ్యవస్థ
- ప్రైవేటు రంగానికి ఊతమిస్తూ దేశవ్యాప్తంగా డేటా సెంటర్ పార్కుల ఏర్పాటుకు త్వరలో నూతన ఆర్థిక వ్యవస్థ.
- భారత్‌నెట్ ప్రాజెక్టులో భాగంగా 'ఫైబర్ టు హోం' (ఎఫ్‌టీటీహెచ్) కనెక్షన్స్ ద్వారా ఈ ఏడాది 1,00,000 గ్రామ పంచాయతీల అనుసంధానం. దీనికి గాను ఈ (2020-21) ఆర్థిక సంవత్సరంలో రూ.6 వేల కోట్ల కేటాయింపు.
- డిజిటల్ ప్లాట్‌ఫాం విస్తరణలో భాగంగా అంకుర సంస్థల ఏర్పాటు, పలురకాల సాంకేతిక విభాగాల్లో దేశవ్యాప్తంగా నాలెడ్జ్ ట్రాన్స్‌లేషన్ క్లస్టర్స్ ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు.
- టెక్నాలజీ క్లస్టర్స్ వృద్ధికి ఊతమిచ్చేలా సదుపాయాలు, తయారీ రంగంలో చిన్న తరహా పరిశ్రమలకు మౌలిక వసతుల కల్పనకు సరికొత్త ఆర్థిక వ్యవస్థ.
- రానున్న ఐదేళ్ల కాలంలో నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్‌పై రూ.8,000 కోట్ల కేటాయింపులు చేసే విధంగా ప్రతిపాదనలు.