కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు విధించిన లాక్డౌన్తో మన జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎన్నో పాఠాలు నేర్పింది ఈ పరిస్థితి. మా నాన్నతో ఇటీవల మాట్లాడుతూ.. ఆర్థిక పరమైన అంశాలను చర్చించాను.
ఈ సంభాషణలో నా జీవితాన్ని ప్రభావితం చేసే చాలా విషయాలు తెలుసుకున్నాను. అలా నేను తెలుసుకున్న ఆరు ముఖ్యమైన ఆర్థిక సూత్రాలు మీ కోసం..
1. అవసరాలు, కోరికల మధ్య భేదం తెలుసుకోవడం..
"నేను నెలకు కేవలం రూ.800తో నా వృత్తిజీవితం ప్రారంభించాను. అప్పుడు పక్కన మీ అమ్మ, నా భుజాలపై నువ్వు ఉన్నావు" అంటూ మా నాన్న గంభీర ధ్వనితో చెబుతుంటే నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
నాన్న చెప్పిన ఈ మాటలతో.. ఆశలు, అవసరాలకు మధ్య తేడాను గ్రహించి కష్టకాలంలోనూ జీవితాన్ని ఎలా అస్వాదించాలో తెలుసుకున్నాను.
ప్రతి ఒక్కరూ.. ఎదుగుతున్న దశలో అనవసర ఖర్చులు చేయించే కోరికలను పక్కనబెట్టి.. అవసరాలపై మాత్రమే దృష్టి పెట్టాలని ఆయన చెబుతుంటారు.
ఆ మాటలు ద్వారా ఎదిగే దశలో ఆర్థిక పరమైన నిర్ణయాలు ఎలా ఉండాలో మా నాన్న ద్వారా నేను తెలుసుకున్నాను.
2. ఆరోగ్యం విషయంలో అలసత్వం వద్దు..
మా నాన్న ఉద్యోగం మారడం వల్ల ఆదాయం పెరిగినప్పటికీ.. పెద్దగా ఆస్తులు మాత్రం కూడబెట్టుకోలేదు. ఈ సమయంలో మన తిండి ఖర్చులు కూడా తగ్గించుకుందామా నాన్న? అన్న నా ప్రశ్నకు.. ఈ రోజు మనం సరైన తిండి తినకుండా పొదుపు కోసం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే.. తర్వాత ఆస్పత్రి ఫీజుల రూపంలో ఇంతకు రెండింతలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చెప్పారు.
నాన్న వృత్తి జీవితం ప్రారంభ దశలో ఉన్నా.. పిల్లల ఆరోగ్యంపై మాత్రం అలసత్వం చూపరు. ఆదాయం తక్కువగా ఉన్నా సరే.. ఖర్చుకు వెనకాడకుండా అవసరమైన వ్యాక్సిన్లు ఇప్పిస్తారు.
పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం కూడా వారి కలలు నెరవేర్చడంలో ఒక భాగమని ఆయన చెబుతుంటారు.
3. క్రమబద్ధమైన పెట్టుబడి..
పిల్లలు పుట్టినప్పటి నుంచే వారి కోసం నెలకు రూ.500 చొప్పున క్రమమైన పెట్టుబడి పెడితే.. ఏడాదికి 12 శాతం వడ్డీ వస్తుంది. ఇలా మీ పిల్లలకు 25 ఏళ్లు వచ్చే వరకు పెట్టుబడి పెట్టి.. ఆ తర్వాత పదవీ విరమణ వయస్సు వచ్చే వరకు ఆ పెట్టుబడిని కొనసాగించమని పిల్లలకు చెప్పండి. అలా చేస్తే వారి రిటైర్మెంట్ సయమానికి దాదాపు రూ.5,02,09,428 చేతికి అందుతుంది. మీరు పిల్లలకు బహుమతి ఇవ్వాలనుకుంటే.. ఇంతకంటే ఉత్తమమైనది ఇంకేం ఉంటుంది.