తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎగుమతులపై రైతు నిరసనల ప్రభావమెంత? - 2020 ఎగుమతుల క్షీణతకు కారణాలు

భారత ఎగుమతులు ఇటీవల రికార్డు స్థాయిలో పడిపోతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు కారణాలేమిటి? రైతుల ఆందోళన ప్రభావం వీటిపై ఎంత? ఎగుమతులు మళ్లీ కొవిడ్ పూర్వ స్థితికి ఎప్పుడు చేరతాయనే విషయాలను.. భారత ఎగుమతిదారు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు శరద్​ కుమార్ సరఫ్​ 'ఈటీవీ భారత్​'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

Farm agitation impact on exports
ఎగుమతులపై రైతుల ఆందోళన ప్రభావం

By

Published : Dec 22, 2020, 5:50 PM IST

Updated : Dec 22, 2020, 10:17 PM IST

శరద్​ కుమార్ సరఫ్​తో 'ఈటీవీ భారత్' ఇంటర్వ్యూ

'మూడు నెలలుగా పంజాబ్​ రైతులు చేస్తున్న ఆందోళనలతో సరకు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైళ్లును అడ్డుకోవడం రోడ్లను నిర్బంధించడం, ట్రక్​లను ఆపేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణం. అయితే ఇప్పుడిప్పుడే సరకు రవాణా మెరుగవుతోంద'ని భారత ఎగుమతిదారు సంఘాల సమాఖ్య (ఎఫ్​ఐఈఓ) అధ్యక్షుడు శరద్​ కుమార్ సరఫ్ 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

సరకు రవాణాపై తొలుత రైతు ఆందోళనల ప్రభావం అధికంగా ఉండేదని సరఫ్ తెలిపారు. అయితే ఇప్పుడు రవాణా ప్రారంభమవడం వల్ల సరకు తరలింపునకు వీలవుతున్నట్ల పేర్కొన్నారు. దిగుమతి చేసుకున్న సరకు కూడా రవాణా అవుతున్నట్లు వివరించారు.

ఈ ఏడాది ఏప్రిల్-నవంబర్ మధ్య దేశీయ ఎగుతులు గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 14 శాతం తగ్గినట్లు అంచనాలున్నాయి. ఈ స్థాయిలో ఎగుమతులు క్షీణించేందుకు అనేక కారణాలు ఉన్నాయని సరఫ్ అన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం తగ్గటం వల్ల ఎగుమతుల్లో క్షీణత సాధారణమేనని చెప్పారు. దీనితో పాటు దాదాపు 3-4 నెలలు ఖాళీ కంటైనర్ల కొరత, సుంకాలు 40-80 శాతం పెరగటం వంటి అసాధారణమైన పరిణామాలూ ఎగుమతుల్లో క్షీణతను ప్రేరేపించినట్లు వివరించారు.

ఖాళీ కంటైనర్లను పోర్ట్​ల నుంచి డిపోలకు తరలించేందుకు రైల్వే శాఖ ఇటీవల అంగీకారం తెలిపిందని సరఫ్ పేర్కొన్నారు. ఇది ఎగుమతులకు సానుకూలమైన అంశమని చెప్పారు. మారుతున్న పరిస్థితులతో ప్రస్తుతం రైతుల ఆందోళన కారణంగా తమపై పెద్దగా ప్రభావం లేదని సరఫ్ తెలిపారు.

సీతారామన్​తో భేటీ..

2021-22 బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల్లో భాగం గత వారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​తో భేటీ అయ్యారు సరఫ్. ఈ సమావేశంలో కొవిడ్ సంక్షోభం వల్ల తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇందుకోసం ప్రభుత్వం వాస్తవికమైన విధానాలతో ముందుకు రావాలని కేంద్రానికి సూచించినట్లు వివరించారు. లేదంటే ఎగుమతులు మరింత క్షీణించే ప్రమాదముందని వివరించినట్లు చెప్పుకొచ్చారు.

కేంద్రం దృష్టికి జీఎస్​టీ రీఫండ్ అంశం..

చిన్న పొరపాట్లకు సరైన విచారణ జరపకుండా.. జీఎస్​టీ రీఫండ్ ఆలస్యం చేయడం, బ్యాంకు ఖాతాలను నిలిపివేయడం వంటి చర్యలకు దిగటం వంటి అంశాలను ఇటీవలి సమావేశంలో లేవనెత్తినట్లు సరఫ్ తెలిపారు.

మర్చెంట్ ఎక్స్​పోర్ట్ ఫ్రం ఇండియా పథకం ద్వారా లభించే ప్రయోజనాన్ని రూ.2 కోట్లకు పరిమితం చేస్తూ సెప్టెంబర్​లో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు వివరించారు.

తాము ప్రభుత్వాన్ని కొత్తగా ఏమీ అడగటం లేదని.. తాము చెల్లించిన సుంకాలను మాత్రమే తిరిగి చెల్లించాలని కోరుతున్నట్లు 'ఈటీవీ భారత్'అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు సరఫ్.

2022లోనే కరోనా ముందున్న స్థాయికి

దేశ ఎగుమతులు కొవిడ్ ముందున్న స్థాయికి రికవరీ అవడం 2022లోనే సాధ్యమని సరఫ్ అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల క్షీణత 12 శాతం నుంచి 15 శాతం మధ్య నమోదవ్వొచ్చని పేర్కొన్నారు. 2020-21 క్యూ4లో ఎగుమతులు సానుకూలంగా ఉంటే.. ఇది 10 శాతానికి పరిమితమవ్వచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:నవంబర్​లోనూ తగ్గిన భారత ఎగుమతులు

Last Updated : Dec 22, 2020, 10:17 PM IST

ABOUT THE AUTHOR

...view details