పెట్టుబడులు ప్రారంభించటం కంటే ముందే ఆరోగ్య బీమా తీసుకోవాలని వ్యక్తిగత ఆర్థిక సలహాదారులు సూచిస్తుంటారు. వ్యక్తిగత ఆరోగ్య బీమా లేదా కుటుంబానికి వర్తించేలా పాలసీ తీసుకోవటంపై నిర్ణయం తీసుకోవాలి. ఈ రెండూ కూడా వైద్యచికిత్సకు పెట్టిన ఖర్చులను పాలసీదారుడికి అందిస్తుంటాయి. బీమా మొత్తం(సమ్ ఇన్సూర్డ్) అంటే గరిష్ఠంగా బీమా కంపెనీ పాలసీదారుడికి చెల్లించే మొత్తం. ఉదాహరణకు రూ. 10 లక్షల బీమా ఉంటే ఆస్పత్రి బిల్లు రూ. 2 లక్షలు అయినట్లయితే ఆ మేరకు బీమా సంస్థ చెల్లిస్తుంది. మిగతా రూ. 8 లక్షలు మరో చికిత్సకు ఉపయోగించుకోవచ్చు.
ఫ్యామిలీ ఫ్లోటర్, వ్యక్తిగత ఆరోగ్య బీమాలో ఎంపిక చేసుకోవటం ఒక్కోసారి కష్టం అవుతుంది. కింది అంశాల ఆధారంగా నిర్ణయించుకోవటం ఉత్తమం.
వ్యక్తిగత ఆరోగ్య బీమా
దీన్ని ఒక్కొక్కరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సి ఉంటుంది. భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు.. ఇలా ఎంత మంది ఉంటే అన్ని పాలసీలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి వ్యక్తి వయస్సు, సంబంధిత బీమా ప్రకారం ప్రీమియం ఉంటుంది. కుటుంబంలోని ఒకరి కంటే ఎక్కువ మంది సభ్యులకు ఒకేసారి బీమా చేయించుకుంటే ప్రీమియంపై బీమా కంపెనీలు 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాయి. ఒక్క సభ్యుడు క్లెయిమ్ చేసుకుంటే మరో వ్యక్తి క్లెయిమ్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు.
ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ
ఇందులో ఒకే పాలసీ ద్వారా ఒకటి కంటే ఎక్కువమంది కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా కవరేజీ ఉంటుంది. దీనికి సంబంధించి ఒకే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లలు ఉంటే.. అందరు కలిసి ఒకే పాలసీ తీసుకోవచ్చు. సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం కుటుంబంలోని పెద్ద వారి వయస్కుల వారి ఆధారంగా నిర్ణయమవుతుంటుంది.
తేడా..
వ్యక్తిగత పాలసీ ద్వారా ఒక్కరు మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ప్లాన్ ప్రకారం, బీమా మొత్తం ఒక్కరే క్లెయిమ్ చేసుకోవచ్చు లేదా అందరూ కలిసి మొత్తంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. కుటుంబంలోని సభ్యులందరూ ఒకేసారి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఇదే సూత్రాన్ని ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఉపయోగించుకుంటుంది.