తెలంగాణ

telangana

ETV Bharat / business

పన్ను మదింపు ఇక ఆన్​లైన్​లో చేసుకోవచ్చు.. - ఈ అసెస్​మెంట్​తో మరింత పారదర్శకంగా మదింపు ప్రక్రియ

పన్ను చెల్లింపుదారులకు మదింపు మరింత సులభం కానుంది. ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి వెళ్లకుండానే మదింపు చేసుకునే వీలు కల్పిస్తూ ఈ-అసెస్​మెంట్​ కేంద్రాన్ని ప్రారంభించింది ఆదాయపన్ను శాఖ. పన్ను మదింపుల్లో పారదర్శకతను మరింత పెంచేందుకు ఈ సంస్కరణ తోడ్పడుతుందని తెలిపింది.

పన్ను మదింపు ఇక ఆన్​లైన్​లో చేసుకోవచ్చు..

By

Published : Oct 8, 2019, 7:31 AM IST

ఆదాయ పన్ను సంస్కరణల్లో భాగంగా కేంద్రం మరో ముందడుగు వేసింది. ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి వెళ్లకుండానే పన్ను మదింపు చేసుకునే వీలును కల్పిస్తూ 'ఈ-అసెస్​మెంట్​' కేంద్రాన్ని ప్రారంభించింది. ఇకపై ఆన్​లైన్​లో ఇంట్లో నుంచే పన్ను మదింపు చేయించుకునే వీలుకలుగనుంది.

రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్​పాండే దిల్లీలోని జాతీయ ఈ-అసెస్​మెంట్ కేంద్రాన్ని ఆవిష్కరించారు. ఈ సంస్కరణతో పన్ను చెల్లింపుదారులకు మదింపు ప్రక్రియ మరింత సులభతరంగా, సౌకర్యవంతంగా మారుతుందని ఆయన అన్నారు. పన్ను మదింపు ప్రక్రియలోనూ పారదర్శక పెరుగుతుందని తెలిపారు.

నిజానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ-అసెస్​మెంట్ కేంద్రాన్ని ప్రారంభించాల్సి ఉంది. ప్రధానితో భేటీకావడం వల్ల ఆమె ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు.

దిల్లీలో ఉన్న ఈ-అసెస్​మెంట్​ ప్రధాన కేంద్రానికి ఆదాయ పన్ను శాఖ ప్రధాన కమిషనర్​ అధిపతిగా వ్యవహరించనున్నారు.

దిల్లీతో పాటు హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్​కతా, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్​లలో ప్రాంతీయ కార్యాలయాలు ఉండనున్నాయి. వీటన్నింటిల్లో సమీక్ష, సాంకేతిక, నిర్ధారణ యూనిట్లు ఉండనున్నాయని ఐటీశాఖ తెలిపింది. వీటికి ఆదాయపన్ను కమిషనర్లు అధిపతులుగా వ్యవహరించనున్నట్లు పేర్కొంది. ఈ అసెస్​మెంట్​ కోసం మొత్తం 2,686 ఆదాయపన్ను శాఖ అధికారులను కేటాయించినట్లు వెల్లడించింది.

ఈ అసెస్​మెంట్ వివారాలు ఇలా..

తొలి విడతలో 58,322 కేసులను ఈ అసెస్​మెంట్​ పరిశీలనకు ఎంపిక చేసింది ఐటీశాఖ. ఆదాయపన్ను చెల్లింపుదారులు వారి ఈ-ఫైలింగ్ ఖాతాను, ఈ-మెయిల్ ఐడీలో నోటీసులను చూసుకోవాలని కోరింది. నోటీసులు అందిన వారికి సమాధానం ఇచ్చేందుకు 15 రోజుల గడువిచ్చింది.

'ఈ-అసెస్​మెంట్'​ ఎందుకంటే..

పన్ను చెల్లింపుదారులు వ్యక్తిగతంగా హాజరుకావడం వల్ల ఆదాయపన్ను శాఖ అధికారులు అక్రమాలకు పాల్పడేందుకు ఆస్కారం కల్గుతోందని బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాంటి అక్రమాలకు తావివ్వకుండా చేసేందుకే 'ఈ-అసెస్​మెంట్'​ పథకాన్ని తీసుకువచ్చినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.

తప్పని సరి కాదు..

ఈ-అసెస్‌మెంట్‌ అన్నది తప్పనిసరికాదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) గతంలోనే స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారు స్వచ్ఛందంగా పన్ను మదింపు పద్ధతిని ఎంచుకోవచ్చని తెలిపింది. ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో అయితే ఐటీశాఖ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సంప్రదాయ పద్ధతిలో ఆదాయపన్ను కార్యాలయం వద్ద వ్యక్తిగతంగా హాజరై పన్ను మదింపు చేయించుకునే వీలుందని తెలిపింది.

ఇదీ చూడండి: ఎస్​బీఐ డెబిట్​ కార్డులపై ఇక ఈఎంఐ సౌకర్యం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details