వరుసగా మూడో నెలలోనూ దేశ ఎగుమతులు క్షీణత నమోదు చేశాయి. డిసెంబరులో దేశీయ ఎగుమతులు 0.8శాతం క్షీణించి 26.89 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. పెట్రోలియం, తోలు, సముద్ర ఉత్పత్తుల్లో క్షీణతే ఎగుమతుల తగ్గుదలకు కారణమని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇదే సమయంలో దిగుమతులు 7.6 శాతం పెరిగి 42.6 బిలియన్ డాలర్లకు చేరాయి. ఫిబ్రవరి తర్వాత పాజిటివ్ వృద్ధి రేటు నమోదు కావడం ఇదే ప్రథమం. ఎగుమతుల క్షీణత వల్ల వాణిజ్య లోటు 25.78 శాతం పెరిగింది. 15.71 బిలియన్ డాలర్లకు ఎగబాకింది.
2019 డిసెంబరులో దేశ ఎగుమతులు 27.11 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 39.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2020 నవంబరులో దేశ ఎగుమతులు 8.74 శాతం క్షీణించాయి.
మొత్తంగా 2021 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో దేశ సరకు ఎగుమతులు 15.8 శాతం పడిపోయి 200.55 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 29.08 శాతం క్షీణించి 364.18 బిలియన్లకు పరిమితమయ్యాయి.
డిసెంబర్లో చమురు దిగుమతులు 10.37 శాతం తగ్గిపోయాయి. ఏప్రిల్-డిసెంబర్ మధ్య 44.46 శాతం క్షీణించి 53.71 బిలియన్ డాలర్లకు చేరాయి.