ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశీయ ఎగుమతులు స్వల్పంగా 0.25 శాతం క్షీణించి.. 27.67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కేంద్ర వాణిజ్య శాఖ మంగళవారం వెల్లడించిన గణాంకాల ద్వారా ఈ విషయం తెలిసింది. ఇదే నెలలో దిగుమతులు 6.98 శాతం పెరిగి.. 40.55 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు వెల్లడించింది. దీంతో వాణిజ్య లోటు 12.32 బి. డాలర్లకు చేరిందని వాణిజ్య శాఖ పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో వాణిజ్య లోటు 10.16 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఎగుమతులు.. దిగుమతులు
2020-21 సంవత్సరంలో ఏప్రిల్- ఫిబ్రవరి మధ్య ఎగుమతులు, దిగుమతుల శాతం అంతకుముందు ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గాయి. ఎగుమతుల విలువ 12.32 శాతం తగ్గి 255.92 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంతకుముందు సంవత్సరం ఆ విలువ 291.87 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య దిగుమతులు కూడా 23 శాతం తగ్గి.. 340.88 బి. డాలర్లుగా నమోదయ్యాయి.