ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలపై భారీగా ఆధారపడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇలా ప్రభుత్వాలే అప్పుల కోసం పోటీ పడుతున్న వేళ.. మార్కెట్లో ప్రైవేట్ వ్యవస్థలకు ద్రవ్యలభ్యత ఉండదేమోనన్న అనుమానులు వ్యక్తమయ్యాయి. అయితే, అలాంటిదేం లేదని, అవసరాలకు సరిపడా నగదు మార్కెట్లో ఉందని.. ఈటీవీ భారత్కు తెలియజేశారు ఇద్దరు ఆర్థిక నిపుణులు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణం కన్నా దాదాపు రూ.8-10లక్షల కోట్లు అప్పుల రూపంలో అధికంగా తీసుకుంటాయని ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి. కొవిడ్ ప్రభావంతో రాబడి పూర్తిగా తగ్గిపోయిన వేళ.. ప్రభుత్వాలకు బ్యాంకులను ఆశ్రయించక తప్పని పరిస్థితి. ఈ అంచనా ప్రైవేట్ సెక్టార్లకు అప్పు పుట్టని ఇబ్బందులు తీసుకొస్తుందనే ఆందోళన రేకెత్తించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగంలో ద్రవ్యలభ్యత సమస్య లేదు. వ్యవస్థీకృత నగదుతో పాటు, రుణాల తగ్గి.. డిపాజిట్లు పెరగటం అందుకు ప్రధాన కారణాలు.
-ఉపాసన భరద్వాజ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కొటక్ మహింద్రా బ్యాంక్
ఉపాసన భరద్వాజ్ అంచనాల ప్రకారం.. దేశంలో రుణాల పెరుగుదల తగ్గిపోగా అదే సమయంలో బ్యాంకు డిపాజిట్లు భారీగా పెరిగిపోయాయి. ఈ వ్యత్యాసం వలన బ్యాంకుల వద్ద అందరి రుణ అవసరాలు తీర్చిగలిగేంత డబ్బు పోగుపడి ఉంది.
రుణాల రూపురేఖలు మార్చేసిన కరోనా..
కరోనా.. కేవలం పన్నుల రాబడులను దెబ్బతీయటమే కాదు ఆర్థిక వ్యవస్థనే ఛిన్నాభిన్నం చేసింది. దేశవ్యాప్త లాక్డౌన్తో మూడు నెలలు మూతపడిన వ్యాపారాలు, పరిశ్రమలు.. ప్రభుత్వాలకు తీరని నష్టం మిగిల్చాయి. ఓవైపు కొవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సిన పరిస్థితి. మరోవైపు కేంద్రం ప్రకటించిన పీఎం గరీబ్ కల్యాణ్ యోజన ప్యాకేజీ నిధులు సమకూర్చాల్సి వస్తోంది.
ఈ పథకం ద్వారా కరోనా విలయంలో కొటుమిట్టాడుతున్న దేశ ప్రజానికాన్ని ఆదుకునేందుకు సంకల్పించింది ప్రభుత్వం. పేదలకు కనీస అవసరాలు తీర్చుతూ నవంబర్ నాటికి 80 కోట్ల మందికి మేలు చేకూర్చాలన్న పట్టుదలతో ఉంది.
రాబడులకు కొవిడ్ దెబ్బ
ఈ ఏడాది ఫిబ్రవరిలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన చేశారు. తమ అంచనాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ ఆదాయం రూ.20లక్షల కోట్లు దాటుతుందని వెల్లడించారు. దాదాపు రూ.1.7లక్షల కోట్లు.. అంటే గతేడాదితో పోలిస్తే 9% వృద్ధి అంచనా వేశారు.
కానీ, కరోనా దెబ్బతో పరిస్థితులు పూర్తిగా తారుమారైపోయాయి. తాజా నివేదికల ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి సెప్టెంబర్ 15 వరకూ పన్నుల రూపంలో వచ్చింది రూ.2.53లక్షల కోట్లు మాత్రమే. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే.. 22.5% తక్కువ.
ఇలా పన్నుల్లో భారీ తగ్గుదల నేపథ్యంలో.. రెవెన్యూ రాబడుల ప్రభావం సంక్షేమ పథకాలపై చాలా ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం బడ్జెట్ అంచనాల్లో చెప్పినట్లుగా రూ.7.8లక్షల కోట్లకు అదనంగా మరో రూ.4లక్షల కోట్లతో.. మొత్తం రూ.12లక్షల కోట్లు అప్పుల రూపంలో సమకూర్చుకోవాలని మే నెలలోనే నిర్ణయానికి వచ్చింది.
ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రాష్ట్రాల అప్పుల పరిమితి కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా రూ.4.26లక్షల కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతులిచ్చింది.
అదే సమయంలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారాన్ని ఇవ్వలేనని చెప్పింది కేంద్రం. అందుకు బదులుగా రాష్ట్రాలు ప్రత్యేక విండో ద్వారా రుణాలు పొందవచ్చని సూచించింది. భవిష్యత్తులో ఈ రుణాలను కేంద్రమే తిరిగి చెల్లిస్తుంది. దీనివల్ల మరో రూ.1-2లక్షల కోట్ల భారం బ్యాంకింగ్ వ్యవస్థపై పడనుంది.