వచ్చే ఏడాది ఆరంభంలో సామాన్యులకు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. టెక్స్టైల్ రంగంలో ధరలు (gst rate on readymade garments) పెరగనున్నాయి. ఇంధన, ఎల్పీజీ, వంట నూనె సహా పలు వస్తువుల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతుండగా.. రానున్న రోజుల్లో మరిన్ని వస్తువుల ధరలు రెక్కలు తొడగనున్నాయి. ఫలితంగా ఇప్పటికే కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న ప్రజలపై మరింత భారం పడనుంది. ముడి పదార్థాల ధరలు పెరగడం సహా వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పెంపు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అయితే వీటిపై కేంద్రం జీఎస్టీని పెంచడానికి అసలు కారణాలేంటి?
దస్తులపై జీఎస్టీని ఎందుకు పెంచారు?
జీఎస్టీ కౌన్సిల్ సిఫారసుల మేరకు దుస్తులపై పన్నురేటును పెంచినట్లు కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. కరోనా కారణంగా ఈ ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను పెంచే నిర్ణయాన్ని రెండేళ్లపాటు వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి. క్రమంగా పరిశ్రమ కోలుకున్న నేపథ్యంలో ఇన్‌వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ఈ నిర్ణయం (gst on readymade garments 2021) తీసుకున్నట్లు చెబుతున్నాయి.
ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ సమస్య ఏమిటి?
ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఇన్‌పుట్‌పై (ముడిపదార్థాలు) ఎక్కువ పన్నులు.. అవుట్‌పుట్ లేదా తుది ఉత్పత్తిపై తక్కువ పన్ను చెల్లించడం. వ్యాపారులు.. అంతిమ ఉత్పత్తులపై కంటే ముడి పదార్థాలపై అధిక జీఎస్టీని చెల్లిస్తున్నారు. ఈ సమస్యను పలు రంగాల్లో పరిష్కరించినప్పటికీ.. చెప్పులు, దుస్తులు, ఔషధాలు, ఎరువుల రంగంలో అలాగే కొనసాగుతోంది. దీని వల్ల జీఎస్టీ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కింద ఉపయోగించని ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను వ్యాపారాలకు వాపసు చేసే సమస్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది.
టైక్స్టైల్స్ రంగలో జీఎస్టీ రేటు పెంపుపై ఆందోళన ఎందుకు?
భారత టెక్స్‌టైల్స్ పరిశ్రమ ప్రకారం.. ఈ రంగంలో 15 శాతం మాత్రమే ఇన్‌వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ సమస్యలను ఎదుర్కొంటోంది. అయితే జీఎస్టీ రేటు పెంపు వల్ల మిగిలిన 85 శాతం ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఇది పరిశ్రమలో వర్కింగ్ క్యాపిటల్ అవసరాలపై.. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ఎక్కువ ఒత్తిడిని సృష్టించే అవకాశం ఉంది.