తెలంగాణ

telangana

ETV Bharat / business

పద్దు 2020: సీతమ్మా​ ఇప్పుడే మేల్కోండి లేదంటే..! - పద్దు 2020

దేశాన్ని 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇందుకు ప్రస్తుతం నెలకొన్న మాంద్యం పరిస్థితులు సవాలుగా మారాయి. ఇలాంటి సమయంలో కేంద్ర బడ్జెట్ వస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి పద్దుపై పడింది. ఇలాంటి సమయాల్లో సరైన దిశగా పద్దు ప్రతిపాదనలు ఉండాలని సూచిస్తున్నారు విశ్లేషకులు. ప్రభుత్వానికి నిపుణుల సూచనలు ఏంటో మీరూ తెలుసుకోండి.

nirmala
నిర్మలా సీతారామన్

By

Published : Jan 29, 2020, 8:42 AM IST

Updated : Feb 28, 2020, 9:03 AM IST

మన దేశంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సవాళ్లతో నలిగిపోతున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్‌.. ఎలా ఉండబోతోందనే విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం మనదేశం ముందున్న అతిపెద్ద సమస్య ఆర్థిక మందగమనం. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత తక్కువ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నమోదు కాబోతోంది. అది 5% లోపే ఉండవచ్చు. దానికంటే పెట్టుబడుల్లో వృద్ధి గణనీయంగా తగ్గిపోవటం పెద్ద సమస్య. పొదుపు మొత్తాల్లోనూ వృద్ధి కనిపించడం లేదు. అదీగాక 2025 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది జరగాలంటే అప్పటివరకూ 11% వార్షిక వృద్ధిని నమోదు చేయాలి. కానీ 5 శాతానికి పడిపోయిన వృద్ధిని 11 శాతానికి పెంచుకోవటం అంత సులభమా? కనీసం ఆ దిశగా ముందుకు సాగాలంటే ఎంతో వినూత్న ప్రతిపాదనలను ఈ బడ్జెట్లో తీసుకురావాలి.

ఆదాయానికి పోటీగా ఖర్చు

2014-19 మధ్యకాలంలో సగటున ప్రభుత్వ ఆదాయాల్లో ఏటా 11.6 శాతం వృద్ధి ఉంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యయం కూడా పెరుగుతోంది. ప్రభుత్వ వ్యయంలో సగటు వార్షిక వృద్ధి 11.8 శాతం వరకూ కనిపిస్తోంది. అంటే ఆదాయానికి పోటీగా వ్యయాలు కూడా పెరుగుతున్నాయన్నమాట. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల ఆదాయాల్లో గణనీయంగా కోతపడవచ్చని తెలుస్తోంది. కార్పొరేట్ పన్ను, ఆదాయపు పన్ను, జీఎస్‌టీ వసూళ్లలో క్షీణత కనిపిస్తోంది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం కూడా సాధ్యం కాని పరిస్థితి. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.లక్ష కోట్లకు పైగా ఉండగా, ఇప్పటి వరకూ రూ.18,000 కోట్లు మాత్రమే సాధించగలిగారు. దీన్ని బట్టి ప్రభుత్వ ఆదాయాలు ఆకర్షణీయంగా లేవని స్పష్టమవుతోంది. పెట్టుబడుల్లో వృద్ధి లేకపోవటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా బ్యాంకింగ్‌- ఎన్‌బీఎఫ్‌సీˆ రంగాల్లో సంక్షోభం దీనికి చాలావరకూ కారణం. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌... తదితర సంస్థలు కుప్పకూలిన తర్వాత మార్కెట్లో నగదు లభ్యత తగ్గిపోయింది. కొత్తగా రుణ లభ్యత కరువైంది. బ్యాంకర్లు అప్పులు ఇవ్వటం తగ్గించి రానిబాకీలు వసూలు చేసుకోవటంలో నిమగ్నమయ్యారు.

వాణిజ్య అవరోధాలతో సమస్య

ఎగుమతుల రంగంలో మనకు ఎదురవుతున్న పోటీ అంతా ఇంతా కాదు. వ్యవసాయోత్పత్తులు, పళ్లు-ఫలాలు, కాగితం, రసాయనాలు, పారిశ్రామిక వస్తువులను ఎగుమతి చేయాలంటే... ఎన్నో అవరోధాలు కనిపిస్తున్నాయి. చైనా, ఐరోపా దేశాలు ఏదో ఒక వంక పెట్టి మనదేశం నుంచి ఆయా దేశాలకు ఎగుమతులు జరగకుండా అడ్డుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రపంచమే ఒక కుగ్రామం అనే వారు. హద్దుల్లేని వ్యాపారాన్ని ప్రోత్సహించారు. కానీ ఇప్పుడు ప్రతి దేశం కూడా వాణిజ్య అవరోధాలు సృష్టిస్తూ తమతమ దేశాల్లోకి ఇతర దేశాల వస్తువులు వచ్చిపడకుండా జాగ్రత్త పడుతున్నాయి. దీంతో మన ఎగుమతులు కూడా తగ్గాయి. ఇదే ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతోంది. ప్రపంచ పోటీతత్వ సూచీలో ఈ ఏడాది మనదేశం ర్యాంకు ఇంతకు ముందున్న 58వ స్థానం నుంచి 68కి పడిపోయింది. ఇది కచ్చితంగా ఎగుమతుల మీద ప్రభావం చూపించేదే. ఇటువంటి పరిస్థితుల్లో బడ్జెట్ వంటి సందర్భాలను ఉపయోగించుకొని సరైన ప్రతిపాదనలతో ముందుకు వస్తే దేశ ఆర్థిక ముఖచిత్రం కొంతైనా మారేందుకు అవకాశం ఉంటుంది.

సాంకేతిక మార్పులూ కారణమే

ఇటీవలి కాలంలో సాంకేతిక మార్పులు శరవేగంగా వస్తున్నాయి. వ్యాపార నిర్వహణ తీరుతెన్నులు సమూలంగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. స్విగ్గీ, జొమాటో, ఓయో, ఉబర్‌, ఓలా వంటి సంస్థల ఆవిష్కరణలతో రెస్టారెంట్లకు వచ్చేవారు తగ్గిపోతున్నారు, హోటళ్లలో గదులు పూర్తిగా నిండని పరిస్థితి. కామన్‌ వర్క్‌ స్పేస్‌ పెరుగుతోంది. అంటే బిజినెస్‌ రీ-ఇంజినీరింగ్‌ అవుతోందన్నమాట. ఈ పరిస్థితుల్లో పాత వ్యాపార పద్ధతులు సాగవు. పాత వ్యాపార సంస్థలు తమతమ పద్ధతులు, సంప్రదాయాలను మార్చుకోవాలి. అటువంటి క్రమంలో ఆర్థికాభివృద్ధి మందగించటం జరుగుతుంది.

రాయితీలు ఇవ్వాలి

గత జులై బడ్జెట్ తర్వాత ప్రభుత్వం నాలుగైదు సందర్భాల్లో క్రియాశీలకంగా స్పందించి ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజితం చేసేందుకు ప్రయత్నించింది. బ్యాంకుల రీ-క్యాపిటలైజేషన్‌ కింద రూ.5 లక్షల కోట్ల వరకూ మద్దతు ప్రకటించింది. ఎన్‌బీఎఫ్‌సీˆలకు నగదు కొరత తీర్చేందుకు రూ.10,000 కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడింది. గృహ నిర్మాణ రంగానికి, వాహన రంగానికీ రాయితీలు ఇచ్చారు. అయినా వృద్ధి రేటు పెరగ లేదు. ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పతనం కావటమే దీనికి ప్రధాన కారణం. ఇటువంటి పరిస్థితుల్లో తీసుకునే దిద్దుబాటు చర్య ఏమిటంటే..., పన్నుల భారాన్ని తగ్గించటం ద్వారా ప్రజల ఆదాయాల్లో మిగులు చూపించి, దాన్ని వ్యయం వైపు మళ్లించటమే. తద్వారా గిరాకీ పెంచాలన్నమాట. అదే సమయంలో ఎగుమతులను పెంచేందుకు ప్రధాన రంగాలను గుర్తించి ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలి. టెక్స్‌టైల్స్‌, వైద్యసేవలు, వజ్రాభరణాలు వంటి రంగాలను ప్రోత్సహించాలి. మరోపక్క దిగుమతుల నుంచి దేశీయ పరిశ్రమను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి. గట్టి ఆంక్షలు ప్రతిపాదించాలి. లేనిపక్షంలో చౌక, నాసిరకమైన వస్తువులను మనదేశంలో కుమ్మరించి లబ్దిపొందేందుకు చైనా వంటి దేశాలు ప్రయత్నిస్తూ ఉంటాయి.

వ్యవసాయ నష్టాలపై దృష్టి పెట్టాలి

వ్యవసాయ రంగంలో నష్టాలు తగ్గించటంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. డెయిరీ రంగంలో విప్లవం తీసుకువచ్చిన ‘అమూల్‌’ పద్ధతులను అనుసరించి వ్యవసాయ రంగంలో పంట తర్వాత నష్టాలను బాగా తగ్గించాలి. కేపిటల్‌ మార్కెట్లో దీర్ఘకాలిక లాభాలపై పన్ను తీసివేయటం, డివిడెండ్‌ పన్ను తొలగించటం....వంటి చర్యలు కూడా అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించేందుకు ఏమేరకు అవకాశం ఉందో కూడా చూడాలి. ద్రవ్యలోటు గత ఏడాదిలో 3.6 శాతం వరకూ వచ్చింది. ప్రోత్సాహకాలను పెద్దఎత్తున ఇస్తే, లోటు ఇంకా పెరుగుతుందనే భయం ఉంటుంది. అయినప్పటికీ ప్రస్తుతానికి లోటు విషయాన్ని పెద్దగా ఆలోచించకుండా ముందు డిమాండ్‌ను పెంపొందించే చర్యలపై దృష్టి సారించాలి. తత్ఫలితంగా ద్రవ్యలోటు 3.8 శాతం వరకూ పెరిగినా పర్వాలేదు. వృద్ధి బాట పట్టిన తర్వాత లోటు విషయాన్ని ఆలోచించవచ్చు. ఎంతోమంది ఆర్థిక వేత్తల మాట కూడా ఇదే. మరోపక్క జీఎస్‌టీ, ఇతర పన్నుల విధానాల్లో సంస్కరణలు తీసుకురావాలి. ఇప్పుడు మందగమనాన్ని తట్టుకునే చర్యలను చేపట్టకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా కుంగిపోయే ప్రమాదం ఎదురుకావచ్చు.

వ్యాసకర్త: కె.నరసింహమూర్తి, బ్యాంకింగ్​, ఆర్థికవ్యవహారాల నిపుణులు

ఇవీ చూడండి:

Last Updated : Feb 28, 2020, 9:03 AM IST

ABOUT THE AUTHOR

...view details