'ఆరోగ్యమే మహా భాగ్యం' అనే విషయాన్ని కరోనా మహమ్మారి ప్రపంచానికి మరోసారి స్పష్టం చేసింది. దీనితో పాటు మన దేశ హెల్త్‌కేర్ రంగంలో లోటుపాట్లను ఎత్తి చూపింది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో 'ఆరోగ్య రంగానికి' భారీ బొనాంజ ప్రకటించొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.
ఈ విషయంపై వైద్యారోగ్య రంగ విశ్లేషకులు 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు.
కరోనా వల్ల భారత్ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం వంటి విషయాల కోసం ఈ సారి బడ్జెట్లో కేంద్రం భారీగా కేటాయింపులు చేయొచ్చని వారంటున్నారు. ఆరోగ్య రంగ కేటాయంపులు జీడీపీలో 1.3 శాతం నుంచి 5 శాతానికి పెరగొచ్చని భావిస్తున్నారు.
గత ఏడాది కేటాయింపులు ఇలా..
గత ఏడాది బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్లు కేటాయించింది కేంద్రం. అదనంగా రూ.35 వేల కోట్లను పోషకాహార సంబంధి కార్యక్రమాల కోసం ప్రతిపాదించింది.
"అత్యంత చౌకగా ఆరోగ్య బీమా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని తీసుకురావాలి. మేము పరిశోధక, ఉత్పాదక విభాగాన్ని అభివృద్ధి చేస్తున్నాం. వీటి ద్వారా తక్కువ ధరకే మంచి ఔషధాలు ఇవ్వగలుగుతాం."
-డాక్టర్ అర్వింద్ గార్గ్, న్యూరాలజిస్ట్, ఆరోగ్య రంగ నిపుణులు
దిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొహల్లా క్లీనిక్ విధానాన్ని కేంద్రం కూడా అందిపుచ్చుకోవాలని సూచిస్తున్నారు అర్వింద్ గార్గ్. ప్రతి జోన్లో వివిధ అవసరాలకు వేర్వేరుగా మెడికల్ కేంద్రాలు ఉండాని చెబుతున్నారు.
ప్రత్యేక క్యాడర్ ఉండాలి..
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)ల తరహాలో.. హెల్త్ కేర్ రంగాన్ని తీర్చిదిద్దగల నేషనల్ మెడికల్ సర్వీస్ (ఎన్ఎంఎస్) క్యాడర్ అవసరమంటున్నారు డాక్టర్ అర్వింద్.
కొన్ని విషయాల్లో కరోనా వైరస్ మేలు చేసిందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
'మనకు ప్రత్యేక డేటా సేకరణ విభాగం అవసరం. భవిష్యత్‌లో సంభవించే ఆరోగ్య అత్యవసర స్థితులను ఎదుర్కొనేందుకు ఎలా సిద్ధంగా ఉండాలనే విషయాన్ని కరోనా మహమ్మారి మనకు ముందే సూచించింది' అని వివరించారు