తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈటీవీ భారత్ ప్రత్యేకం: జీఎస్టీ ప్రస్థానానికి రెండేళ్లు

జీఎస్టీ.. దేశ పన్నుల విధానంలో సమూల మార్పులు తెస్తూ అమలైన విధానం. అప్పటి వరకు ఉన్న పలు రకాల పన్నుల విధానాన్ని ఏకతాటిపైకి తెచ్చిందీ విధానం. ఈ ప్రతిష్ఠాత్మక పన్నుల విధానానికి నేటితో రెండేళ్లు నిండాయి. ఈ సందర్భంగా జీఎస్టీపై ప్రత్యేక కథనం...

జీఎస్టీ ప్రస్థానానికి రెండేళ్లు

By

Published : Jul 1, 2019, 8:55 AM IST

'ఒకే దేశం... ఒకే పన్ను' నినాదంతో ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కి నేటితో రెండేళ్లు పూర్తయ్యాయి. 2017, జులై 1న ఈ నూతన పన్నుల విధానం అమల్లోకి వచ్చింది.

ఎందుకీ జీఎస్టీ?

ముఖ్యంగా పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేసేందుకు జీఎస్టీని అమలు చేసింది ప్రభుత్వం. ఇంతకు ముందున్న సంప్రదాయ పన్ను విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా పన్నుల విధానాలను అమలు చేసేవి. ఇలా చేయడం వల్ల వస్తువులపై పన్నుల భారం ఎక్కువగా ఉండేది. వీటితో పాటు పన్నులు కూడా వేరు వేరుగా ఉండేవి. వీటన్నింటిని ఏకతాటి పైకి తీసుకురావడం కూడా జీఎస్టీ అమలు చేయడానికి ముఖ్య ఉద్దేశం.

2003లోనే బీజం

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జీఎస్టీ అమల్లో ఉంది. ఈ విధానాన్ని మన దేశంలోనూ అమలు చేసేందుకు 2003లోనే ప్రక్రియ ప్రారంభమైంది. 2004లో ప్రభుత్వం మారడం వల్ల కొన్నాళ్లు జీఎస్టీ అంశం ఊసేలేకుండా పోయింది. 2007లో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం 2010 నుంచి జీఎస్టీ అమలు చేయడానికి ప్రయత్నించారు. ఇందుకోసం ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2011లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్​ ముఖర్జీ జీఎస్టీకోసం రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై వ్యతిరేకత ఎక్కవగా ఉన్నకారణంగా జీఎస్టీ అమలు సాధ్యపడలేదు.

2016లో ఆమోదం

అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 2016, ఆగస్టు 3న రాజ్యసభలో జీఎస్టీ బిల్లు ప్రవేశపెట్టగా అదే రోజు ఆమోదం పొందింది. అదే నెల 8న లోక్​సభలో బిల్లును ప్రవేశపెట్టగా అక్కడా ఆమోదముద్ర పడింది. 2016 సెప్టెంబర్​ 8న బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేశారు.

జీఎస్టీలో భాగాలు

సమాఖ్య విధానం కారణంగా జీఎస్టీని మూడు భాగాలుగా రూపొందించారు.

  • 1. సీ-జీఎస్టీ: వస్తు సేవలపై కేంద్రం విధించే పన్నులు.
  • 2. ఎస్​-జీఎస్టీ: వస్తు సేవలపై రాష్టాలు విధించే పన్నులు.
  • 3. అంతర్​​రాష్ట్ర జీఎస్టీ: రెండు రాష్ట్రాల మధ్య సరకు రవాణాపై జీఎస్టీని కేంద్రం విధిస్తుంది. ఆ మొత్తాన్ని కేంద్రమే ఇరు రాష్ట్రాలకు పంచుతుంది.

రాష్ట్రాల విన్నపం...

జీఎస్టీ కారణంగా రాష్ట్రాలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఆ నష్టాన్ని ఐదేళ్ల వరకు కేంద్రమే భరిస్తుందని హామీ ఇచ్చింది.

మరిన్ని విశేషాలు

  • 2018-2019 ఆర్థిక సంవత్సరంలో మొత్తం జీఎస్‌టీ వసూళ్లు రూ.11.77 లక్షల కోట్లు.
  • 2017 ఆగస్టు నుంచి 2018 మార్చి 31 వరకు మొత్తం జీఎస్‌టీ వసూళ్లు రూ.7.41 లక్షల కోట్లు.
  • జీఎస్టీ అమలయ్యాక ఈ ఏడాది ఏప్రిల్​లో అత్యధికంగా రూ.1,13,865 కోట్లు వసూలయ్యాయి.
  • జీఎస్టీ అత్యల్ప వసూళ్లు 2017 డిసెంబర్​లో రూ. 83,716 కోట్లు.
  • ప్రస్తుతం 0, 5, 12, 18, 28 శాతం శ్లాబుల్లో జీఎస్టీ వసూలు చేస్తున్నారు. భవిష్యత్​లో కేవలం మూడు శ్లాబులనే అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదీ చూడండి: జీఎస్టీ అటుఇటైతే ఎస్​ఎమ్ఎస్​ వస్తుంది!

ABOUT THE AUTHOR

...view details