ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) చందాదారులకు అందించే ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) పరిహారం మొత్తాన్ని పెంచింది. ఈ పథకంలోని సభ్యులు ఏదైనా కారణంతో మరణిస్తే నామినీకి చెల్లించే కనీస బీమా మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి 2.5 లక్షలకు, గరిష్టంగా రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు ఇటీవల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది ఈపీఎఫ్ఓ.
ఈ ఏడాది ఏప్రిల్ 28 నుంచే పెంచిన బీమా మొత్తాలు వర్తించనున్నాయి. వచ్చే మూడేళ్ల వరకు ఈ మొత్తాలు కొనసాగనున్నట్లు తెలిపింది ఈపీఎఫ్ఓ.
ఈడీఎల్ఐ పథకం అంటే?
ఈపీఎఫ్ఓ చందాదారులైన ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు అకాలంగా మరణిస్తే.. వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది కేంద్రం. 1976లో ఇది అమలులోకి వచ్చింది. ఈ పథకం ఈపీఎఫ్‌లోని క్రియాశీల చందాదారులందరికీ వర్తిస్తుంది.
ఈ బీమా పొందేందుకు ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగి తరఫున ఆయా సంస్థలు నామమాత్రపు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.
ఈపీఎఎఫ్ చట్టం 1952 ప్రకారం.. ప్రైవేటు రంగ ఉద్యోగులందరికి ఈ పథకం తప్పనిసరి కాదు. ఈడీఎల్ఐ కన్నా ఎక్కువ కవరేజీనిచ్చే బీమా సదుపాయాన్ని కల్పించే సంస్థలు ఈ పథకాన్ని వర్తింపజేయాల్సిన అవసరం లేదు. ఈ కారణంగానే చాలా సంస్థలు ఈడీఎల్ఐకి బదులు టర్మ్ ఇన్సూరెన్స్‌ను అందిస్తాయి.