2021 ఫిబ్రవరిలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) పేరోల్‌లో కొత్త చేరికలు భారీగా పెరిగాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే దాదాపు 20 శాతం పెరిగి.. కొత్తగా 12.37 లక్షల మంది చేరారు. ఈ మేరకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన ఈపీఎఫ్ఓ పేరోల్ డేటాలో వెల్లడైంది.
పేరోల్ డేటాలోని కీలకాంశాలు..
- 2021 జనవరి నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఈపీఎఫ్‌లో కొత్త చందాదారులు 3.52 శాతం పెరిగారు.
- 2020 ఫిబ్రవరితో పోలిస్తే.. 2021 ఫిబ్రవరిలో కొత్త చందాదారుల సంఖ్య 19.63 శాతం పెరిగింది.
- కొవిడ్ మహమ్మారి కొనసాగుతున్నప్పటికీ.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో(ఫిబ్రవరి నాటికి) నికర చందాదారుల సంఖ్య 69.58 లక్షలకు చేరింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇది 78.58 లక్షలుగా ఉంది. అంతకుముందు సంవత్సరంలో ఈ సంఖ్య 61.12 లక్షలుగా ఉంది.
- 2021 ఫిబ్రవరిలో కొత్తగా చేరిన వారిలో 22-25 సంవత్సరాల వారే అత్యధికం. నికర చందాదారుల్లో వీరి సంఖ్య 3.29 లక్షలుగా ఉంది.
- దేశవ్యాప్తంగా చూస్తే.. నికర ఈపీఎఫ్ చందాదారులలో మహరాష్ట్ర, హరియాణా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. మొత్తం చందాదారుల్లో ఈ రాష్ట్రాల నుంచి 38.14 లక్షల మంది(54.81 శాతం) మంది ఉన్నారు.