తెలంగాణ

telangana

ETV Bharat / business

సామాన్యుడికి విద్య, వైద్యం అందేలా కేంద్ర సంకల్పం! - Cigarettes

బడ్జెట్​ ప్రసంగంలో విద్య, వైద్య రంగాలకు గణనీయ స్థాయిలో కేటాయింపులు జరిపింది కేంద్రం. సంక్షేమ రంగానికి పెద్దపీట వేసిన కేంద్రం.. విద్యారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించనున్నట్లు 2020బడ్జెట్​ ప్రకటనలో స్పష్టం చేసింది. ఆయుష్మాన్ పథకంలో భాగంగా 112 జిల్లాల్లోని ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించింది.

education
పద్దు 2020: సామాన్యుడికి విద్య, వైద్యం అందేలా కేంద్ర సంకల్పం!

By

Published : Feb 1, 2020, 9:48 PM IST

Updated : Feb 28, 2020, 8:03 PM IST

సామాన్యుడికి విద్య, వైద్యం అందేలా కేంద్ర సంకల్పం!

బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మూడు సూత్రాల పథకాన్ని ప్రకటించిన కేంద్రం.. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసింది. విద్య, వైద్య రంగాలకు చెప్పుకోదగిన స్థాయిలో కేటాయింపులు జరిపింది. విద్యారంగానికి రూ. 99,312 కోట్లు, వైద్యానికి రూ. 69,400 కోట్లు కేటాయించింది.

బడ్జెట్​ పద్దుల్లో విద్యారంగం:

విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనకు విదేశీ వాణిజ్య రుణాలు, ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించనున్నట్లు వెల్లడించింది కేంద్ర సర్కారు. విద్యారంగానికి 99,312 కోట్లు కేటాయించిన కేంద్రం.. నైపుణ్యాభివృద్ధి శిక్షణకు మరో రూ. 3వేల కోట్ల నిధులను ఖర్చుచేయనున్నట్లు వెల్లడించింది.

త్వరలో నూతన విద్యావిధానం

2030నాటికి ప్రపంచ దేశాల్లో అత్యధికంగా పనిచేయగలిగిన యువత భారత్​లో ఉండనుందని.. ఈ నేపథ్యంలో వారికి అవసరమైన నైపుణ్యాలతో త్వరలోనే ఓ నూతన విద్యావిధానాన్ని తీసుకువస్తామని ఉద్ఘాటించింది.

"2030 వరకు అత్యధికంగా పనిచేయగలిగిన యువత భారత్​లో ఉండనుంది. వారికి కేవలం విద్య మాత్రమే కాదు.. ఉద్యోగాలు, నైపుణ్య అభివృద్ధి కూడా కావాలి. రాష్ట్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖలు, పార్లమెంట్ సభ్యులు సహా విద్యావేత్తలతో సంప్రదింపులు జరిగాయి. 2లక్షలకు పైగా సూచనలు వచ్చాయి. నూతన విద్యావిధానం త్వరలో ప్రకటిస్తాం. మన విద్యావిధానానికి ఆర్థిక వనరులు కావాలి. అత్యుత్తమ విద్యావేత్తలు, సృజనాత్మక విద్య కావాలి. ఇందుకోసం విదేశీ రుణాలు ప్రత్యక్ష పెట్టుబడులను విద్యలో ప్రవేశపెడుతున్నాం."

-నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి.

కొత్త విద్యాసంస్థలు

జాతీయ పోలీస్ విశ్వవిద్యాలయం, జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ వర్సిటీలను నెలకొల్పనున్నట్లు ప్రకటించింది కేంద్రం. వైద్యకళాశాలలను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో జిల్లాలోని ఆసుపత్రులకు అనుసంధానించనున్నట్లు వెల్లడించింది. బలహీనవర్గాల కోసం దేశంలోని 100 అత్యున్నత విద్యాసంస్థల్లో డిగ్రీస్థాయిలో ఆన్​లైన్ కోర్సు ప్రవేశపెడతామని వెల్లడించింది మోదీ సర్కారు.

ఇండ్-శాట్​తో...

భారత్​లో చదవాలనుకునే ఆసియా, ఆఫ్రికా దేశాల విద్యార్థుల కోసం ఇండ్-శాట్ ప్రవేశపరీక్షను కొత్తగా తీసుకు వస్తున్నట్లు వెల్లడించింది కేంద్రం. ఇందులో ఉత్తీర్ణులయితేనే ఆయా ఖండాల్లోని విద్యార్థులు భారత్​లో చదివేందుకు అర్హత సాధించనున్నారు.

సాధారణ డిగ్రీ విద్యార్థులకు అప్రెంటిస్​షిప్

సాధారణ డిగ్రీ విద్యార్థుల్లో ఉద్యోగితను పెంచే లక్ష్యంతో 150 ఉన్నత విద్యాసంస్థల్లో అప్రెంటిస్​ విధానాన్ని ప్రవేశపెడతామని ప్రకటించింది కేంద్రం. 2021 మార్చి నాటికల్లా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు కృషి చేయనున్నట్లు వెల్లడించింది. అదే సమయంలో సాంకేతిక విద్యార్థులకు పట్టణ స్థానిక సంస్థల్లో ఏడాదిపాటు ఇంటర్న్​షిప్ అవకాశం కల్పిస్తామని తెలిపింది.

బడ్జెట్ పద్దులో వైద్య రంగం..

2025 సంవత్సరంలోగా క్షయ నిర్మూలనకు సంకల్పించింది కేంద్ర సర్కారు. మిషన్ 'ఇంధ్ర ధనుష్'​ పథకంలో మరో 12 వ్యాధులను చేర్చనునున్నట్లు స్పష్టం చేసింది. ఈ పథకం కింద మరో 5 వ్యాక్సిన్లు ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది. వైద్యరంగానికి రూ. 69 వేలకోట్లకు పైగా కేటాయించింది కేంద్రం. ఇందులో పీఎం జన ఆరోగ్య యోజనకు 6400 కోట్లు, సాధారణ వైద్య రంగ బడ్జెట్ రూ. 67,484 ఉన్నాయి.

ఇక ఓడీఎఫ్ ప్లస్..

బహిరంగ మలవిసర్జ నిర్మూలనకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. స్వచ్ఛ భారత్‌ కోసం రూ. 12,300 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఓడీఎఫ్‌ ప్లస్‌ కార్యక్రమం ద్వారా బహిరంగ మలవిసర్జన నిర్మూలన అమలుతీరును మెరుగుపరచనున్నట్లు స్పష్టం చేసింది. ఘన వ్యర్ధాల సేకరణ, వేరు చేయడం, దాని తదుపరి వినియోగంపై దృష్టిసారించనున్నట్టు పేర్కొంది.

ఆయుష్మాన్ భారత్

ఆయుష్మాన్ భారత్ ద్వారా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేయనున్నట్లు ఉద్ఘాటించింది కేంద్రం. ఆయుష్మాన్ భారత్ పథకం ఇప్పటికీ అమలు కాని 112 జిల్లాల్లోని ఆసుపత్రుల్లో.. సౌకర్యాల మెరుగుదల తమ తొలి ప్రాధాన్యమని వెల్లడించింది. ఈ 112 జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే ఆసుపత్రుల్లోని వైద్య పరికరాలకు పన్ను రాయితీ కల్పిస్తామని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమ అమలుకు కృత్రిమ మేథస్సును ఉపయోగించనున్నట్లు పేర్కొంది.

ఫిట్ ఇండియా

ఫిట్ ఇండియా కార్యక్రమం ద్వారా దీర్ఘకాలిక రోగాల నియంత్రణ చేపట్టినట్లు వెల్లడించింది కేంద్రం. పీఎం జన్ ఆరోగ్య పథకం ద్వారా 20వేల ఆసుపత్రులను మెరుగుపరచినట్లు స్పష్టం చేసింది.

స్వచ్ఛమైన తాగునీటి కోసం

స్వచ్ఛమైన తాగునీటిని అందించే దిశగా జల్ ​జీవన్ మిషన్​కు రూ. 3.60 లక్షల కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించింది సర్కారు. స్థానిక నీటి వనరులు, వాననీటి సంరక్షణ వంటి కార్యక్రమాలపై ఖర్చు చేయడం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామని ఉద్ఘాటించింది.

వైద్య పరిశోధనలు-ఆయుష్ పథకం

వైద్య పరిశోధన రంగానికి రూ. 2100 అందించనుంది సర్కారు. ఆయుష్ మంత్రిత్వశాఖకు రూ. 2122. 08 కోట్లు కేటాయించింది.

జన ఔషధ కేంద్రాలకు..

జనరిక్ మందులను అందించే జన ఔషధ కేంద్రాలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని వెల్లడించింది కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగంగా 2వేల రకాల మందులు, 3వందల రకాల ఆపరేషన్ ఉపకరణాలను అందుబాటులో ఉంచనున్నట్లు స్పష్టం చేసింది. అదే సమయంలో వైద్య దిగుమతులపై 5 శాతం సెస్​ను విధించనున్నట్లు పేర్కొంది.

Last Updated : Feb 28, 2020, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details