తెలంగాణ

telangana

ETV Bharat / business

'వృద్ధి సానుకూలమే.. కొత్త కేసులతోనే భయం'

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబరు-డిసెంబరు)లో దేశ స్థూల దేశీయోత్పత్తి 0.4 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే జీడీపీలో పెరుగుదల రూ.14వేల కోట్లే అయినా.. సాంకేతిక మాంద్యం నుంచి బయటపడేందుకు దోహదపడింది. అయితే.. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

new cases threatens fragile recovery
'జీడీపీ సానుకూల వృద్ధి'పై కొత్త కేసుల ముప్పు

By

Published : Feb 27, 2021, 11:32 AM IST

కరోనా మహమ్మారి విజృంభణతో వరుసగా రెండు త్రైమాసికాల క్షీణత కారణంగా ఏర్పడిన సాంకేతిక మాంద్యం నుంచి భారత్​ బయటపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికంలో సానుకూల వృద్ధి నమోదు చేసింది. శుక్రవారం జాతీయ గణాంక కార్యాలయం(ఎన్​ఎస్​ఓ) విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం.. అక్టోబరు-డిసెంబరు 2020లో స్థూల దేశీయోత్పత్తి 0.4 శాతం మేర వృద్ధి చెందింది. కానీ, భారత్​లో మహారాష్ట్ర వంటి పారిశ్రామిక రాష్ట్రాల్లో కొత్త కేసులు గణనీయంగా పెరగటం ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై సవాళ్లు విసురుతోంది.

2011-12 స్థిర ధరల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ రూ.36.22 లక్షల కోట్లకు చేరుకుంది. 2019-20 ఇదే మూడు నెలల కాలంలో నమోదైన రూ.36.08 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 0.4 శాతం అధికం. తేడా రూ.14వేల కోట్లు మాత్రమే అయినప్పటికీ.. మాంద్యం నుంచి బయటపడేందుకు ఇది సరిపోతుంది.

ప్రధానంగా వ్యవసాయం, సేవలు, నిర్మాణ రంగాలు మంచి పనితీరు ప్రదర్శించడం వల్ల అక్టోబరు-డిసెంబరులో వృద్ధి రాణించింది. మూడో త్రైమాసికంలో వ్యవసాయం రంగం 3.5 శాతం, నిర్మాణ రంగం 6.2శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. విద్యుత్తు, గ్యాస్​, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవలు 7.3 శాతం పెరిగాయి. కరోనా కారణంగా వాణిజ్యం, హోటళ్ల పరిశ్రమ మాత్రం 7.7 శాతం మేర క్షీణించింది.

వాస్తవ లెక్కలతో పోలిస్తే తక్కువే..

వాస్తవ లెక్కల ప్రకారం.. 2020-21లో జీడీపీ రూ.134.09 లక్షల కోట్లకు చేరుతుందని ఎన్​ఎస్​ఓ అంచనా వేసింది. అంటే 2019-20లో రూ.145.69తో పోలిస్తే 8 శాతం తక్కువ అన్నమాట. రూ.11.6 లక్షల కోట్లు క్షీణత.. దేశంలో వస్తు, సేవల ఉత్పత్తి ఈ ఆర్థిక ఏడాదిలో నెలకు సుమారు రూ.1 లక్షల కోట్లు తగ్గినట్లు సూచిస్తోంది. సగటున నెలకు ఉత్పత్తి 2019-20లో రూ.12.14 లక్షల కోట్లుగా ఉంది. కానీ ఈ ఏడాదికి అది రూ.11.17 లక్షల కోట్లుగా అంచనా వేసింది ఎన్​ఎస్​ఓ.

కొత్త కేసుల పెరుగుదలతో పొంచి ఉన్న ముప్పు!

ఆర్థిక వ్యవస్థ 'వి' ఆకారంలో పుంజుకుని మూడో త్రైమాసికం (అక్టోబరు-డిసెంబరు)లో 0.4 శాతం వృద్ధి చెందటం ప్రధానంగా పండుగల సీజన్​లో ఆన్​లైన్​ అమ్మకాలు భారీగా పెరగటంపై ఆధారపడింది. అయితే.. ఈ సున్నితమైన రికవరీతో పాటే.. దేశంలోని మహారాష్ట్ర, పంజాబ్​, కేరళ, ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​ వంటి రాష్ట్రాల్లో కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో స్థానిక లాక్​డౌన్ల వల్ల ఆర్థిక కార్యకలాపాలు మరోమారు మూతపడే ప్రమాదం ఉందనే ఆందోళనలు పెంచుతోంది. మహారాష్ట్రలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలను విస్తరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే ప్రకటించారు.

గత ఏడాది సెప్టెంబర్​లో భారత్​లో రోజుకు 90-95 వేల వరకు కేసులు వెలుగు చూశాయి. ఈ నెల తొలినాళ్లలో కొత్త కేసులు రోజుకు 10 వేల లోపునకు పడిపోయాయి. అయితే.. గత వారం రోజులుగా కొత్త కేసులు 16-17 వేలకు పెరిగాయి. క్రియాశీల కేసుల సంఖ్యా పెరిగింది. ఈ పరిణామాలతో కరోనా సెకండ్​ వేవ్​ను అడ్డుకునేందుకు ఆయా రాష్ట్రాలకు నిపుణుల బృందాలను కేంద్రం పంపాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

ఇదీ చూడండి:దేశంలో మరో 16,488 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details