ముడి చమురు బ్యారెల్ ధర కనీవినీ ఎరుగని స్థాయికి దిగజారిపోయింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌ఛేంజీలో తాజాగా బ్యారెల్ ధర 23 డాలర్లు పలికింది. 1973 జులైలో ముడి చమురు బ్యారెల్ 20 డాలర్లకు పడిపోయింది. 1946, 1998లలో స్వల్పకాలంపాటు బ్యారెల్ రేటు 17 డాలర్లుగా ఉంది. కరోనా ప్రభంజనంతో ప్రపంచవ్యాప్తంగా విత్త మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఫలితంగా ముడి చమురు ధరలు పాతాళానికి చేరాయి. భారత్‌లోనూ ఆర్థిక సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. ముప్ఫై రోజుల కాలావధిలో సెన్సెక్స్ మూడింట ఒకవంతు పతనమైంది. కొవిడ్-19 దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుంది? సంక్షోభం సద్దుమణిగి దేశ ఆర్థికం ఎన్నటికి గాడినపడుతుంది అన్నవి ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు.
ఇప్పటికిప్పుడు కరోనా మటుమాయమైనా..
చైనాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. వైరస్ బారినపడి సంభవించే మరణాలను ఆ దేశం దాదాపుగా నియంత్రించగలిగింది. కాబట్టి, మన దేశంలోనూ ఈ మహమ్మారిని కట్టడి చేయడం సాధ్యమేనని కొందరు ఆశల తోరణాలు కడుతున్నారు. సానుకూల దృక్పథంతో ముందడుగు వేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులు ఆశించినంత అనుకూలంగా లేవు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కరోనా ఇప్పటికే చాలావరకు భ్రష్టుపట్టించింది. ఇప్పటికిప్పుడు ప్రపంచంనుంచి కరోనా మటుమాయమైనా- అది సృష్టించిన విధ్వంస ప్రభావం కనీసం మరో ఏడాదిపాటు కొనసాగుతుంది. అవసరమైనప్పుడే బయటకు రావాలని, సమూహాల్లో ఉండరాదని ప్రభుత్వాలు పదేపదే చేస్తున్న ప్రచారం ప్రజాబాహుళ్యాన్ని కదిలిస్తోంది. దీనివల్ల వైరస్ విస్తరణ వేగాన్ని కొంతవరకు కట్టడి చేయవచ్చు. కానీ, టీకా అందుబాటులోకి వచ్చినప్పుడే సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యం. ఇందుకు మరో రెండేళ్లు పట్టవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొని వ్యాపార కార్యకలాపాలు, జనసంచారం మొదలయ్యాక- ఉన్నట్లుండి వైరస్ మరోసారి కోరసాచినా ఆశ్చర్యం లేదు.
ఒక్కరిపైనై ఆధారపడటం వల్లే..
ఇకమీదట వ్యాపార, వాణిజ్యాలకు సంబంధించి భారత్ తన వ్యూహాలను సమీక్షించుకోవాల్సి రావచ్చు. ఇటలీలో ఫ్యాషన్ పరిశ్రమ పూర్తిగా చైనాపై మరీ ముఖ్యంగా ఆ దేశంలోని వుహాన్ నగరంపై ఆధారపడి మనుగడ సాగిస్తోంది. ఒక్కరిపైనే ఆధారపడటం ఫ్రాన్స్‌కు అతిపెద్ద ప్రతికూలాంశం. బంగ్లాదేశ్ తనకు అవసరమైన ముడివనరులను చైనానుంచి భారీగా దిగుమతి చేసుకుని- అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఇకమీదటా ఇదే విధానాన్ని కొనసాగించడం ఆ దేశానికి సాధ్యమా అన్నది చర్చనీయాంశం. ముడి చమురు ధరలు తగ్గినా ప్రయోజనంలేని పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయ ప్రయాణాలు దాదాపుగా స్తంభించిపోవడంతో విమానయాన రంగం కుదేలైంది. కరోనా తాకిడి తగ్గిన తరవాతా కొన్ని దేశాలు ప్రయాణ, పర్యాటక ఆంక్షలు కొనసాగించవచ్చు. వ్యాపార పరిమాణం దారుణంగా తగ్గడంవల్ల- రెవిన్యూ లక్ష్యాల సాధనలో ప్రభుత్వంతోపాటు కార్పొరేట్ రంగమూ చతికిలపడటం ఖాయం.