తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక సర్వే 2019-20లోని కీలకాంశాలు ఇవే.. - Budget 2020

సార్వత్రిక బడ్జెట్​కు ముందు​ 'సంపద సృష్టి'ని నేపథ్యంగా తీసుకుని ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టింది కేంద్రం. వాణిజ్య అనుకూల విధానాలకు ప్రోత్సాహం, ఉద్యోగాల పెంపు తదితర అంశాలను ప్రముఖంగా నివేదించింది. ఆర్థిక సర్వేలోని మరిన్ని కీలకాంశాలు మీకోసం..

Economic Survey
Economic Survey

By

Published : Jan 31, 2020, 7:02 PM IST

Updated : Feb 28, 2020, 4:48 PM IST

మందగమనం, అధిక ద్రవ్యోల్బణం వంటి సవాళ్లు ఉన్నా దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందంటూ ఆశావహ చిత్రం ఆవిష్కరించే ప్రయత్నం చేసింది ఆర్థిక సర్వే. బడ్జెట్​లో ఆర్థిక లోటు లక్ష్యాలను సడలిస్తే రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందని సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5శాతంగా ఉన్న వృద్ధి రేటు.. వచ్చే ఏడాదికి 6-6.5శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది.

బడ్జెట్ సమావేశాల ప్రారంభ కార్యక్రమంలో ఆర్థిక సర్వే 2019-20ను ప్రవేశపెట్టారు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్​.

ఆహార రాయితీలను తగ్గించి సంపద, ఉద్యోగాలు సృష్టించే వ్యాపారులపై దృష్టి సారించాలని ఆర్థిక సర్వే తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభంలో తయారీ రంగానికి ప్రోత్సాహం కల్పించాలని.. ఫలితంగా ఉద్యోగాల పెరుగుదల సాధ్యమవుతుందని స్పష్టం చేసింది.

సంపద సృష్టి, వాణిజ్య అనుకూల విధానాలకు ప్రోత్సాహం, ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం.. ఈ మూడు అంశాలే నేపథ్యంగా ఆర్థిక సర్వేను విడుదల చేసింది కేంద్రం.

ఆర్థిక సర్వేలోని కీలకాంశాలు...

వృద్ధి రేటు..

  • రానున్న ఆర్థిక సంవత్సరానికి గాను 6-6.5 శాతం వృద్ధిరేటు నమోదు కానుంది. ప్రస్తుతం 11 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయి 5శాతం నమోదైంది.
  • వృద్ధి రేటు పెంచేందుకు ఈ ఏడాది ఆర్థిక లోటు లక్ష్యాలను సడలించాలి.
  • ప్రస్తుతం రెండో అర్ధ వార్షికంలో వృద్ధి రేటు పెరుగుదల 10 అంశాలపై ఆధారపడి ఉంది. ఎఫ్​డీఐల ప్రవాహం, డిమాండ్​ పెంపు, జీఎస్​టీ రెవెన్యూ సానుకూల పెరుగుదల ఇందులో ముఖ్యమైనవి.
  • వృద్ధి రేటును పెంచేందుకు త్వరితగతిన సంస్కరణలపై నిర్ణయం తీసుకోవాలి.

జీడీపీ..

  • 2025లోపు 5 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారటానికి నైతికంగా సంపద సృష్టి జరగాలి. ఈ లక్ష్యం నెరవేరాలంటే ఈ మధ్య కాలంలో మౌలిక సదుపాయాలపై 1.4 ట్రిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టాలి.

ఉద్యోగాలు..

  • 2011-12లో 17.9 శాతంగా ఉన్న ఉద్యోగాలు.. 2017-18 నాటికి 22.8శాతానికి పెరిగాయి.
  • ఈ ఏడేళ్లలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 2.62 కోట్లు ఉద్యోగ సృష్టి జరిగింది.
  • మహిళల ఉద్యోగాల్లో 8 శాతం పెరుగుదల కనిపించింది.

వాణిజ్య విధానాలు..

  • వ్యాపార వ్యవహారాల్లో ప్రభుత్వ మితిమీరిన జోక్యం వల్ల ఆర్థిక స్వేచ్ఛ దెబ్బతింటుంది. దీనిపై సంస్థాగతంగా పరిశీలించాలి. అవసరం లేని చోట జోక్యాన్ని తగ్గించాలి.
  • మాఫీలు రుణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఆ ఫలితం మళ్లీ రైతులపైనే పడుతుంది. సాధారణం కన్నా తక్కువ రుణాలు లభిస్తాయి. ఆహార రాయితీలు తగ్గించాలి.
  • ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పాలనా వ్యవహారాలు చక్కదిద్దాలి. ప్రజలు, సంస్థలకు నమ్మకం కలిగించాలి.
  • సులభతర వాణిజ్యంలో మరిన్ని ప్రమాణాలు పెంచాలి. కొత్త వ్యాపారాలు అనుమతులను సరళీకరించాలి. ఆస్తుల రిజిస్ట్రేషన్​, పన్ను చెల్లింపులు, ఒప్పందాల అమలులో నిబంధనల సడలింపు అవసరం.

ప్రస్తుత ఏడాదిలో..

  • ఈ ఏడాది మొదటి అర్ధ వార్షికంలో ఎగుమతులతో పోలిస్తే దిగుమతులు భారీగా తగ్గాయి.
  • 2019 ఏప్రిల్​లో 3.2గా ఉన్న ద్రవ్యోల్బణం.. 2019 డిసెంబర్​ నాటికి 2.6 శాతానికి చేరింది. ఇది డిమాండ్ తగ్గేందుకు కారణమై, ఆర్థిక మందగమనాన్ని పెంచుతుంది.
  • 2019 ఏప్రిల్​-నవంబర్​ మధ్య కాలంలో జీఎస్టీ వసూళ్లు 4.1 శాతం పెరిగాయి.

సంపద సృష్టే లక్ష్యం: ప్రధాని

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. సంపద సృష్టి, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థక వ్యవస్థ లక్ష్యాలపై ఆర్థిక సర్వే దృష్టి ప్రధానంగా దృష్టి సారించిందన్నారు.

"130 మంది కోట్ల భారతీయులకు కోసం సంపద సృష్టిపై ఆర్థిక సర్వే దృష్టి సారించింది. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించేందుకు బహుముఖ వ్యూహాలు అవసరమని సూచించింది. ఎగుమతులు, సులభతర వాణిజ్యం తదితర అంశాలను ప్రస్తావించింది."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

Last Updated : Feb 28, 2020, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details