ఆర్థిక మాంద్యం ఉద్ధృతంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మౌలిక సౌకర్యాల విస్తరణ ద్వారానే సంక్షోభాన్ని ఎదుర్కోవాలన్న వాదన గడచిన కొంతకాలంగా ఊపందుకుంటోంది. ఆ క్రమంలోనే మౌలిక సౌకర్యాల కోసం రాబోయే అయిదేళ్లలో రూ.కోటి కోట్లకుపైగా ఖర్చుపెట్టనున్నట్లుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు పెట్టుబడుల ప్రణాళికనూ సిద్ధంచేసింది. వరసగా మూడేళ్లపాటు వృద్ధిరేటు క్షీణముఖం పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆర్థిక వ్యవస్థలు క్లిష్ట పరిస్థితుల్లో ప్రస్థానిస్తున్నప్పుడు మౌలికరంగంపై వ్యయాలను పెంచడమన్నది ప్రపంచంలోని అనేక దేశాలు అనుసరిస్తున్న పద్ధతి. ఇందుకు దక్షిణ కొరియా ఉదంతమే తాజా ఉదాహరణ. వాణిజ్యంపైనే ప్రధానంగా ఆధారపడే ఆ దేశం ఎగుమతులు నిరుడు తీవ్ర ఒడుదొడుకులకు గురయ్యాయి. అమెరికా, చైనాల మధ్య తలెత్తిన వాణిజ్య విభేదాల కారణంగా సరఫరా వ్యవస్థలో ఆటంకాలు తలెత్తడంతో దక్షిణ కొరియా ఎగుమతులు చిక్కుల్లో పడ్డాయి. ఫలితంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం నెమ్మదించింది. అదే క్రమంలో దేశంలో ఉద్యోగ అవకాశాల్ని పెంచి, ప్రైవేటు రంగం కార్యకలాపాలకు ఉత్తేజాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే మౌలికరంగ సదుపాయాల అభివృద్ధి కోసం 5,100 కోట్ల డాలర్ల ప్రణాళికను ప్రకటించారు. ఈ పెట్టుబడులు దేశంలో గిరాకీని పెంచుతాయని, తద్వారా ప్రైవేటు రంగం ఊపందుకుంటుందని, ఆర్థిక వ్యవస్థ పురోగమనం బాటపడుతుందని దక్షిణ కొరియా ప్రభుత్వం భావిస్తోంది. ఇంచుమించు ఇదే వ్యూహాన్ని వివిధ ప్రపంచ దేశాలూ అమలు చేస్తున్నాయి. మాంద్యానికి మందుగా భారత్ సైతం ఇప్పుడు ఇదే మార్గాన్ని ఎంపిక చేసుకోవడం హర్షణీయం. మౌలిక సౌకర్యాల కల్పనకు డబ్బు వెచ్చించడంతోపాటు- ఆ నిధులు వినియోగమవుతున్న తీరుపట్ల అప్రమత్తంగా ఉండటమూ అవసరమే.
ఆ ప్రాజెక్టుల జాప్యంతో లక్షల కోట్ల భారం..
నిర్దిష్ట కాలావధిలో మౌలిక రంగ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా వివిధ కారణాలతో వాటిని ఏళ్లుపూళ్లుగా నాన్చడంవల్ల ఖజానాకు భారీ బొర్రెపడుతోంది. దేశంలో రూ.150 కోట్లు ఆపై విలువగల 400 మౌలిక రంగ ప్రాజెక్టులు జాప్యం కారణంగా నిర్ణీత కాలావధిలో పూర్తికాకపోవడంవల్ల ప్రభుత్వంపై నాలుగు లక్షల కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని కేంద్ర ప్రభుత్వ గణాంక సంస్థ నివేదిక వెల్లడించింది. రూ.కోటి కోట్లకుపైగా విలువైన పెట్టుబడుల ప్రణాళిక అమలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవడానికి ఇంతకుమించిన ప్రణాళిక లేదు. మౌలిక రంగానికే పెద్దపీట వేస్తూ ప్రభుత్వం 80 శాతం పెట్టుబడుల్ని రహదారులు, పట్టణరంగం, గృహరంగం, రైల్వేలు, విద్యుత్తు, సాగునీటి రంగాల్లో పెట్టనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 78 శాతంమేర భారాన్ని సమానంగా పంచుకోనుండగా, 22 శాతం ప్రైవేటు రంగం మోయాల్సి ఉంటుంది. జాతీయ మౌలికరంగ ప్రణాళికలో భాగంగా- 2020-2025 వరకు అమలు చేయదగిన మౌలికరంగ ప్రాజెక్టుల జాబితాను ఇందులో రూపొందించారు. వీటిలో కొన్ని ఇప్పటికే అమలులో ఉన్నాయి. గడచిన అయిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రహదారులు, గృహరంగం, పట్టణ, డిజిటల్, ఇతర మౌలిక రంగాల్లో గణనీయంగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.