అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలు, కరోనా వంటి అనుకోని సంక్షోభాలు.. ప్రజలను పలకరించి వెళుతుంటాయి. వచ్చిన ప్రతీసారి ప్రాణ, ఆస్తి నష్టాలను కలిగిస్తూనే ఉంటాయి. ఇలాంటి సమయాల్లో కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా మరణించినా లేదా అస్వస్థతకు గురైనా చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఆర్థిక విపత్తుల నుంచి కుటుంబాన్ని రక్షించుకునేందుకు.. "ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దన్ క్యూర్" - అంటే వ్యాధి వచ్చాక బాధపడటం కన్నా.. రాకుండా నివారించడం మంచిదనే సూత్రం సరిగ్గా సరిపోతుంది.
సంక్షోభ సమయంలో కుటుంబానికి ఆర్థికంగా రక్షణ కల్పించేందుకు పాటించాల్సిన 5 ప్రధాన సూత్రాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. జీవిత బీమా:
కుటుంబంలో సంపాదించే వ్యక్తి పేరుపై ఒక టర్మ్ పాలసీ తీసుకోండి. హామీ మొత్తం వార్షిక ఆదాయానికి 15 నుంచి 20 రెట్లు ఉండాలి. 60 సంవత్సరాలు వచ్చే వరకు పాలసీని కొనసాగించండి. పాలసీని కొనుగోలు చేసే సమయంలో అన్ని సరైన వివరాలను అందించండి. దీని వల్ల భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి. బీమా సంస్థ కోరితే, వైద్య నివేదికలను అందజేయండి. పాలసీ గురించి కుటుంబ సభ్యలకు తెలియజేయండి. 5 సంవత్సరాలకు ఒకసారి పాలసీని సమీక్షించి, అవసరమైతే అదనపు పాలసీని తీసుకోవాలి. క్లెయిమ్ మొత్తం కొంత భాగం ఏకమొత్తంగానూ, మిగిలినది 5 సంవత్సరాల పాటు నెలవారీగా తీసుకొనెలా ఏర్పాటు చేసుకోవడం మంచిది.
2. అత్యవసర నిధి:
అత్యవసర నిధి కోసం 6 నెలల పాటు నెలవారీ ఖర్చులకు సరిపోయే మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకోవాలి. ఆకస్మికంగా ఉద్యోగం కోల్పోయినా లేదా ఉద్యోగం మారినా.. ఈ నిధి ఉపయోగపడుతుంది.
ఉదాహరణకు కరోనా కాలంలో చాలా మంది ఉద్యోగం కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందిపడ్డారు. అత్యవసర నిధి ఉంటే అలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే వీలుంటుంది.
3.ఆరోగ్య బీమా: