దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిలూదే ఉద్దేశంతో కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ వివరాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్యాకేజీ నాలుగో రోజు ప్రకటనలో భాగంగా వృద్ధి అవకాశాలు మెండుగా ఉండే నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టిసారించినట్లు తెలిపారు. ఈ సంస్కరణలు వివిధ రంగాల్లో గొప్ప మార్పు తీసుకొస్తాయని స్పష్టం చేశారు.
మొత్తం ఎనిమిది రంగాలకు సంబంధించి ఉద్దీపనలు ప్రకటించారు నిర్మల. బొగ్గు, పౌర విమానయానం, అణు, రక్షణ, విద్యుత్ రంగాలతో పాటు సామాజిక మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా ప్రైవేటు పెట్టుబడులకు పెద్ద పీట వేసేలా ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలు వెలువరించారు.
పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి
'భారత్‌లో తయారీ'తో ఉత్పత్తి, వినియోగం, ఎగుమతులకు ప్రోత్సాహకాలు అందించే విధంగా నూతన సంస్కరణలు రూపొందిస్తున్నట్లు నిర్మల తెలిపారు. దేశవ్యాప్తంగా ఉపాధి పెంచేందుకు ఈ నూతన సంస్కరణలు ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. పెట్టుబడుల ఆకర్షణకు అనుగుణంగా రాష్ట్రాల వారీగా ర్యాంకులు ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
- పారిశ్రామిక క్లస్టర్ల నవీనీకరణ కోసం రాష్ట్రాల ద్వారా పథకం అమలు
- పెట్టుబడులకు ప్రోత్సహం కల్పించే విధంగా పారిశ్రామిక భూబ్యాంకు ఏర్పాటు
- పారిశ్రామిక సమాచార వ్యవస్థ(ఐఐఎస్)లో జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా అందుబాటులో భూసమాచారం
- 5 లక్షల హెక్టార్లలోని 3376 పారిశ్రామిక పార్కుల సమాచారం సిద్ధం
- పారిశ్రామిక పార్కులకు 2020-21 నుంచి ర్యాంకింగ్
ప్రైవేటుకు బొగ్గు
బొగ్గు రంగంలో ప్రభుత్వ గుత్తాధిపత్యం తగ్గించేలా చర్యలు చేపట్టారు నిర్మల. పోటీతత్వం పెంచేలా ఈ రంగంలో ప్రైవేటు వ్యక్తులకు అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఖనిజ రంగంలోనూ విధానపర సంస్కరణలు తీసుకొస్తున్నట్లు తెలిపారు నిర్మల. క్యాప్టివ్ మైన్లు, నాన్ క్యాప్టివ్ మైన్ల మధ్య వ్యత్యాసాన్ని తొలగిస్తున్నట్లు చెప్పారు. తద్వారా గనుల లీజు బదిలీ సహా మిగులు ఖనిజం అమ్మకానికి వీలు కలుగుతుందని స్పష్టం చేశారు. వివిధ ఖనిజాలకు గనుల శాఖ మినరల్ ఇండెక్స్ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
2023-24 నాటికి ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే విధంగా కోల్ ఇండియా లిమిటెడ్ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.50 వేల కోట్ల పెట్టుబడి అందించనున్నట్లు స్పష్టం చేశారు. కొత్త బొగ్గు గనులను కనుగొనేందుకు నిరంతరం ప్రయత్నించనున్నట్లు చెప్పారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా బొగ్గు సరఫరాకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
- పరిశ్రమలకు ఇబ్బందిలేకుండా బొగ్గు సరఫరా
- బొగ్గును వాయువుగా మార్చేందుకు నూతన సాంకేతికత
- బొగ్గు ఉత్పత్తికి అందుబాటులోకి కొత్తగా 500 బ్లాకులు
- బాక్సైట్- బొగ్గు గనులు కలిపి వేలం వేసేలా కొత్త విధానం
- గనుల రంగంలో సరళీకృత వ్యాపార విధానాలు
- మైనింగ్ లీజులపై విధించే స్టాంప్ డ్యూటీల హేతుబద్ధీకరణ
- పాక్షికంగా వినియోగించుకున్న గనులను ఇతరులకు బదిలీ చేసేందుకు వెసులుబాట్లు
రక్షణ
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా రక్షణ ఉత్పత్తుల్లో భారత్ స్వావలంబంన సాధిస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సైన్యానికి నాణ్యమైన ఆయుధాల కోసం దిగుమతులు అవసరమని స్పష్టం చేశారు. అవసరమైన దిగుమతులు చేసుకుంటూనే.. మేకిన్ ఇండియా ద్వారా సొంతంగా తయారీ చేపట్టనున్నట్లు తెలిపారు. రక్షణ తయారీ రంగంలో ఆటోమేటిక్ విధానం ద్వారా వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49శాతం నుంచి 74శాతానికి పెంచారు. ఆయుధాలు, విడి భాగాల తయారీకి బడ్జెట్లోనే ప్రత్యేక కేటాయింపులు జరపనున్నట్లు స్పష్టం చేశారు.
- ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కార్పొరేట్ బాడీలుగా మార్పు
- ఆయుధాల ఉత్పత్తి, పరిశోధనలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ద్వారా పారదర్శక నిర్ణయాలు
- ఆయుధాల సేకరణ, తయారీదారుల ఎంపికలో జాప్యం నివారణ
పౌర విమానయానం
విమానయాన రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు నిర్మలా సీతారామన్. భారతీయ ఏరోస్పేస్ రూట్లలో హేతుబద్ధీకరణ జరుగుతున్నట్లు వెల్లడించారు. హేతుబద్ధీకరణతో ప్రయాణ సమయంతో పాటు ఇంధనం ఆదా అవుతుందని స్పష్టం చేశారు. ఫలితంగా వినియోగదారులపై భారం తగ్గుతుందని పేర్కొన్నారు.