తెలంగాణ

telangana

ETV Bharat / business

నెలకు రూ.50వేలు పెన్షన్ రావాలంటే? - ఉత్తమ రిటైర్మెంట్ ప్రణాళిక

జీవితంలో పదవీవిరమణ అనంతర కాలం అద్భుత సమయం. జీవితంలో ఏ చింతా లేకుండా గడపాల్సిన సమయం కూడా ఇదే. అయితే మలి వయస్సును అనందంగా గడపాలంటే.. అందుకు ముందస్తు ప్రణాళిక ఎంతో అవసరం. ఉద్యోగం ఉన్నప్పుడు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇది సాధ్యపడదు. మరి రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి అవసరాలు ఉంటాయి? అందుకు ఇప్పుడు పాటించాల్సిన పొదుపు ప్రణాళిక ఏమిటి? అనే విషయంపై ఉదాహరణతో కూడిన ప్రత్యేక కథనం మీ కోసం.

The best retirement plan
ఉత్తమ రిటైర్మెంట్ ప్రణాళిక

By

Published : Sep 16, 2020, 5:47 PM IST

ఉద్యోగ జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒత్తిడితో పాటు అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ ఉరుకులు, పరుగుల జీవితంలో బతుకు బండి సాఫీగా నడపడం పెద్ద సవాలే. ఓ వైపు కుటుంబ సమస్యలు.. మరోవైపు ఆర్థిక కష్టాలు అనునిత్యం వెంటాడుతుంటాయి. వాటికి ఎదురీది చివరకు ఉద్యోగ విరమణానంతర జీవితంలోనైనా హాయిగా గడపాలనుకుంటాం. అప్పుడైనా ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వకూడదని ఆశిస్తాం. కానీ అందుకుతగ్గ ప్రణాళిక వేసుకోకపోతే మాత్రం ఆ చిక్కులు తప్పవు. అందుకే, చిన్నప్పటి నుంచే పొదుపు అలవర్చుకొనేలా కచ్చితమైన ప్రణాళికలు తప్పనిసరి. సరైనచోట మదుపు చేస్తేనే.. మలి వయసులో ప్రశాంతమైన ఆర్థిక జీవితాన్ని సాగించేందుకు వీలవుతుంది.

సాధారణంగా ఉన్నత విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు 25ఏళ్ళ నాటికి ఉద్యోగంలో చేరతారు. అయితే, తొలినాళ్లలో పెద్దగా పొదుపుపై దృష్టిపెట్టకపోవచ్చు గానీ.. 30ఏళ్లు వచ్చేసరికి బాధ్యతలు మొదలవుతాయి. కాబట్టి, భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం తప్పనిసరి. ప్రతి మనిషి జీవితంలో మలిదశలో పెన్షన్‌ వచ్చేలా పొదుపు చేయడానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక ఉదాహరణ చూద్దాం..

మలి దశ జీవనానికి ఉత్తమ పెట్టుబడి ప్రణాళిక

పిట్టకథ..

30 ఏళ్ల అజయ్.. పదవీ విరమణ తర్వాత అతడి ఖర్చులకు సరిపడా పెన్షన్ రావాలని కోరుకుంటున్నాడు. దానికోసం ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టాలి? పదవీ విరమణానంతర ఖర్చుల కోసం పెట్టుబడులు తప్పనిసరి. అయితే, మీరు చేసిన పెట్టుబడి దానికి సరిపోయేంత లేకపోవచ్చు. అందుకోసం ప్రత్యేకమైన ప్రణాళిక ఉండాలి. సాధారణంగా అయితే తల్లిదండ్రులు పదవీ విరమణ తర్వాత ఖర్చులు తగ్గించుకోవడమో లేదా వారి పిల్లలపై ఆధారపడటమో జరుగుతుంది. అప్పుడు కుటుంబానికి ఆర్థికంగా మరింత భారం పెరుగుతుంది. అలా కాకుండా సంపాదిస్తున్నప్పుడే పదవీ విరమణ అనంతరం సరిపోయేంత నిధిని సమకూర్చుకుంటే తర్వాత ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు.

అజయ్ పదవీ విరమణ ప్రణాళికలో ఉత్తమ అంశం సమయం. అతను 55 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేస్తాడని అనుకుంటే 25 సంవత్సరాల లాభదాయకమైన సమయం మిగిలి ఉంది. ఇదే అతని బలం. ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చుల ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తే 25 ఏళ్ల తర్వాత ఖర్చులు వేగంగా పెరుగుతాయనడంలో సందేహం లేదు. ఉదాహరణకు అతడికి ఎప్పటికీ ఉండే ముఖ్యమైన ఖర్చులు ప్రస్తుతం సుమారు రూ. 15,000 అనుకుందాం. ద్రవ్యోల్బణాన్ని సంవత్సరానికి 6 శాతం మాత్రమే అంచనా వేసినప్పటికీ 55 ఏళ్ల వయస్సులో ఆ ఖర్చులు రూ.64,000కి పెరుగుతాయి. ఇంకా ఖర్చులు పెరిగితే అప్పుడు ఇది మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

అజయ్ పదవీ విరమణ తర్వాత నెలకు రూ. 64,000 పెన్షన్ కావాలని కోరుకుంటున్నాడు. దీనిపై 20 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది అనుకుంటే, సుమారుగా ఏడాదికి రూ. 9.50 లక్షలు అవసరం ఉంటుంది. రిటైర్మెంట్ కార్పస్ 5.5శాతం చొప్పున పెరుగుతుందని అనుకుందాం. ఈ లెక్కన ఏడాదికి రూ. 9.50 లక్షలు రావాలంటే, పదవీ విరమణ సమయానికి సుమారుగా రూ. 1.95 కోట్లు అవసరమవుతుంది. పెట్టుబడులపై సగటున 9-10 శాతం రాబడిని 25 ఏళ్లకు పొంది రూ.1.95 కోట్ల మార్కును చేరుకోవాలంటే నెలకు రూ.15 వేలు నుంచి రూ. 17వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?

1.ఈ లక్ష్యం కోసం చాలా సమయం ఉన్నందున 9-10 శాతం రాబడి సాధించడానికి కొంత రిస్క్ తీసుకోవచ్చు. పదవీ విరమణ నిధి కోసం ఎన్‌పీఎస్‌(నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌) మంచి ఎంపిక. టైర్ -1 ఖాతాను తెరిచి, ఇందులో నెలవారీ పెట్టుబడి పెట్టవచ్చు.

2.ఈ రాబడిని సాధించడానికి మ్యూచువల్ ఫండ్స్ కూడా సహాయపడతాయి. తక్కువ రిస్క్ ఉన్న నిఫ్టీ ఇండెక్స్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

పెట్టుబడులు

రిటైర్మెంట్ కార్పస్ పొందాక..

1.మీరు ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు పెట్టినట్లయితే, 60 ఏళ్లు దాటినప్పుడు మాత్రమే కార్పస్‌ను ఉపసంహరించుకోవచ్చు. అందులో 60 శాతం కార్పస్‌ను పన్ను రహితంగా ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 40 శాతం మొత్తాన్ని నెలవారీ పెన్షన్ కోసం యాన్యుటీని కొనుగోలు చేయడానికి ఉపయోగించాలి. ఆ 60 శాతాన్ని పెన్షన్ రూపంలో పొందడానికి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లేదా ఎల్ఐసీ వయ వందన యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు.

2. ఇక అంత పెన్షన్ పొందేందుకు మరో ఆప్షన్ ఏంటంటే, 55 నుంచి 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు (నెలవారీ వడ్డీ తీసుకుంటూ), పదవీ విరమణ నిధిని 5 ఏళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఆ తరువాత కార్పస్‌ను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లేదా వయ వందన యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు.

3.బీమా సంస్థల యాన్యుటీ ప్లాన్‌లను కూడా తీసుకోవచ్చు. కానీ, వివిధ ఛార్జీల కారణంగా రాబడి ఇందులో కొంత తక్కువగా ఉంటుంది.

చివరి మాట:

పైన తెలిపిన ఉదాహరణ మధ్య తరగతి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోబడింది. అదే ఉదాహరణలో ఇప్పటి నెలసరి ఖర్చులు రూ.30 వేలు అనుకుంటే, 25 ఏళ్ళకి ఇది సుమారుగా రూ. 1.25 లక్షల వరకు ఉండొచ్చు. కాబట్టి, ఈ లక్ష్యం చేరుకోవడానికి మీరు నెల నెలా సుమారుగా రూ. 30-35 వేల వరకు మదుపు చేయాల్సి ఉంటుంది.

ఈ కథనంలో పేర్కొన్న కార్పస్ మీ పీఎఫ్ కాకుండా కూడబెట్టుకోవాల్సిన మొత్తం. పెరిగిన ఖర్చులు, ఆదాయాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. మీకు ఇతర లక్ష్యాలు ఉంటే, ఇప్పటి నుంచి దాని కోసం ప్రణాళిక వేసుకోవాలి. ఏదైనా కొత్త ఖర్చులను జోడించే ముందు రెండుసార్లు ఆలోచించండి. ఎందుకంటే ఇది మీ పెట్టుబడి మీద ప్రభావం చూపుతుంది. సాధ్యమైనంతవరకు రుణాన్ని నివారించండి లేదా ప్రాథమిక ఆర్థిక లక్ష్య ప్రణాళిక అమలయ్యే వరకు గృహ రుణం వంటి అత్యవసర రుణాన్ని వాయిదా వేయండి. కనీసం 30శాతం జీతం పెట్టుబడులకు కేటాయిస్తే రుణాలు చెల్లిస్తున్నప్పటికీ ఫర్వాలేదు.

  • గమనిక: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. ఫైనాన్స్‌ ప్లానింగ్‌ నిపుణులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోగలరు.

ఇదీ చూడండి:ఒరాకిల్ సొంతం కానున్న టిక్‌టాక్‌ కార్యకలాపాలు!

ABOUT THE AUTHOR

...view details