అవసరానికి చేతిలో డబ్బు లేనప్పుడు పర్సనల్ లోన్ బాగా ఉపయోగపడుతుంది. అన్ని రకాల అవసరాలకు పర్సనల్ లోన్ వినియోగించుకునే వీలుంది. ఈఎంఐ ద్వారా తిరిగి చెల్లించే వెసులుబాటు కూడా దీనికి ఉంటుంది. అయితే పర్సనల్ లోన్‌పై పన్ను ప్రయోజనాలను తీసుకోవచ్చు.. చాలా మందికి దీనిపై అవగాహన ఉండదు అని నిపుణులు అంటున్నారు.
పన్ను ప్రయోజనాలు ఎలా..
ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. ప్రత్యక్షంగా పర్సనల్ లోన్‌కి సంబంధించి పన్ను మినహాయింపు లేదు. ఈ రుణాన్ని ఉపయోగించిన తీరును బట్టి పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పర్సనల్ లోన్‌ను ఆదాయంగా పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి దీనిపై పన్ను విధించరాదు. రుణానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖకు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. పర్సనల్ లోన్‌పై పన్ను పొదుపు లేదా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. అయితే వడ్డీకి మాత్రమే ఇవి వర్తిస్తాయి. అసలు మొత్తానికి ఇవి వర్తించవు.
ఈ ప్రయోజనాలు పొందేందుకు అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలను ఆదాయపు పన్ను శాఖకు సమర్పించాల్సి ఉంటుంది.
వ్యాపార ఖర్చుల కోసం...
పర్సనల్ లోన్‌ను సొంత అవసరాలతో పాటు వ్యాపార కార్యకలాపాల కోసం ఉపయోగించుకోవచ్చు. వ్యాపారంలో భాగంగా ఆస్తుల కొనుగోలు, వ్యాపార కార్యకలాపాలు విస్తరించటం తదితర ఖర్చుల కోసం ఉపయోగించినట్లైతే.. రుణంపై చెల్లించే వడ్డీని పన్ను మిహాయింపు ఉన్న ఖర్చుగా క్లెయిమ్ చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
వడ్డీని మూలధన లాభాల నుంచి తీసేయటం ద్వారా అవి తగ్గిపోతాయి. దీనితో నికర పన్ను తగ్గిపోతుంది. దీనికి సంబంధించి గరిష్ఠ పన్ను మినహాయింపు లేదు. ఎందుకంటే ఇది ఆర్థిక సంవత్సరంలో చెల్లించే వడ్డీపై ఆధారపడి ఉంటుంది.
గృహాల కొనుగోలు
పర్సనల్ లోన్ ద్వారా గృహాన్ని నిర్మించుకోవటం కానీ, కొనుగోలు కానీ చేస్తే.. వడ్డీపై పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు మినహాయింపు ప్రయోజనాలు పొందవచ్చు. గృహానికి సంబంధించే రుణాన్ని ఉపయోగించినట్లు కచ్చితమైన ఆధారాలు ఉండాలి.
ఇతర ఆస్తుల కొనుగోలు..
పర్సనల్ లోన్‌తో కేవలం గృహ నిర్మాణం, కొనుగోలు కాకుండా బంగారం, నగలు, కంపెనీల షేర్లు కొనుగోలు చేయవచ్చు. వీటి విషయంలో కూడా వడ్డీకి సంబంధించి పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. అయితే ఈ మినహాయింపులను అదే సంవత్సరంలో తీసుకోలేమని, ఈ ఆస్తులను విక్రయించినప్పుడు మాత్రమే వడ్డీని తీసుకోవచ్చని పన్ను నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:క్రెడిట్ కార్డు రద్దు చేసుకోవాలనుకుంటున్నారా?