చాలా కాలంగా మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటుండగా, అకస్మాత్తుగా ఒక ఆన్లైన్ స్టోర్‌లో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను చూశారు. అది పండగ సీజన్ కావడం వల్ల ఆ ఫోన్‌పై సుమారు 40 నుంచి 45 శాతం మేర తగ్గింపు కూడా లభిస్తుండడం వల్ల వెంటనే దానిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటారు. అన్ని డిస్కౌంట్లు పోగా దాని ధర రూ.35,594గా ఉంది. అలాగే మీరు 'బై నౌ' ఆప్షన్ కింద ఒక చిన్న లైన్‌ని కూడా గమనించారు. అదేంటంటే, క్రెడిట్ కార్డు ద్వారా నెలకు సుమారు రూ. 1,700 నుంచి మొదలుకొని సమానమైన నెలవారీ వాయిదాలలో (ఈఎంఐ) ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. మీరు వెంటనే కొనుగోలు చేయకుండా, ఒక్క నిమిషం అలోచించి ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకోండి.
సాధారణంగా కొంతమంది కేవలం ఈఎంఐ మొత్తం మాత్రమే క్రెడిట్ కార్డు నుంచి డిడక్ట్ అవుతుందని భావిస్తారు, కానీ మీరు చేసిన లావాదేవీ మొత్తం ముందుగా మీ క్రెడిట్ కార్డు నుంచి డిడెక్ట్ అవుతుంది. అనంతరం ఈ మొత్తం ఈఎంఐ కింద మారుతుంది. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు పరిమితి రూ.75,000 అనుకుంటే, మీరు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి రూ.35,594 ఖర్చు చేశారు. అనంతరం మీ కార్డులో కేవలం రూ.40,000 మాత్రమే అందుబాటులో ఉంటుంది.
దీంతో మీ భవిష్యత్తు అవసరాలకు ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించి మీరు కొన్ని నెలల పాటు విదేశాల్లో విహారయాత్రకు వెళ్లాలని అనుకున్నట్లైతే, అప్పుడు మీరు మీ ఆర్థిక అవసరాలను పునఃనిర్మించుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మీ క్రెడిట్ పరిమితి సుమారు సగానికి తగ్గిపోయింది.
ఎలా పనిచేస్తుంది?
మీరు క్రెడిట్ కార్డు ద్వారా రూ.35,594తో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు, వెబ్ సైట్ చెల్లింపు విభాగం మీ క్రెడిట్ కార్డ్ వివరాలను నమోదు చేయాల్సిందిగా అడుగుతుంది. అనంతరం ఈఎంఐ కాలపరిమితిని ఎంచుకోవాల్సిందిగా అడుగుతుంది. సాధారణంగా ఈఎంఐ కాలపరిమితి అనేది 3 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఒకవేళ మీరు ఒక సంవత్సర ఈఎంఐ కాలపరిమితిని ఎంచుకున్నట్లైతే, 14 శాతం వడ్డీ రేటుతో నెలకు రూ.3,196 ఈఎంఐని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మీరు స్మార్ట్‌ఫోన్ కోసం చెల్లించే పూర్తి మొత్తం రూ. 38,352 గా ఉంటుంది. ఇందులో వడ్డీ కింద అదనంగా రూ. 2,759 లను చెల్లించినట్లు లెక్క.