ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు సమయం దగ్గర పడుతోంది. ప్రత్యక్ష పన్నుల సేకరణ లక్ష్యాన్ని పూర్తి చేయాలని వివిధ రాష్ట్రాల్లోని ఆదాయ పన్ను శాఖ అధికారులను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఆదేశించింది.
దీనిపై సీబీడీటీ సభ్యురాలు(ఆదాయం) నీనా కుమార్ అన్ని ప్రాంతీయ శాఖ ఉన్నతాధికారులకు ఓ లేఖ రాశారు. బడ్జెట్లో నిర్దేశించిన రూ.12లక్షల కోట్ల పన్ను వసూలు లక్ష్యాన్ని గడువులోపు పూర్తిచేయాలని సూచించారు. ఈ నెల 23 నాటికి నిర్దేశించిన లక్ష్యంలో 85 శాతం (రూ.10లక్షల21వేల251 కోట్లు) మాత్రమే వసూలయినట్టు వెల్లడించారు.