నెలవారీగా కొంత మొత్తంలో పెట్టేందుకు మ్యూచువల్ ఫండ్ల సిప్‌లు చాలా ఉత్తమమైనవి. ఇటీవల కాలంలో చాలా మంది సిప్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. వేతన జీవులు ఎక్కువగా ఈ విధానాన్ని ఎంచుకుంటుంటారు.
సిప్‌లో నెలవారీ పెట్టుబడి మొత్తం ఫిక్సెడ్గా ఉంటుంది. వీటి వల్ల మార్కెట్ ఒడుదొడుకుల్లో పెట్టుబడులు పెట్టటం వల్ల తీసుకున్న ఫండ్ యూనిట్ల విలువ సరాసరి అవుతుంది. చాలా కాలం నుంచి దేశంలో రిటైల్ పెట్టుబడిదారులు సిప్‌ను ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇప్పుడు స్మార్ట్ సిప్‌లు అందుబాటులోకి వచ్చాయి.
స్మార్ట్ సిప్ అంటే?
మార్కెట్లు పెరుగుతున్నప్పుడు నెలవారీ పెట్టుబడి తగ్గించటం, మార్కెట్లు తగ్గుతున్నప్పుడు నెలవారీ పెట్టుబడిని పెంచుకోవటమే స్మార్ట్ సిప్. దీనివల్ల సూచీలు తగ్గుతున్నప్పుడు ఎక్కువ పెట్టుబడి, పెరుగుతున్నప్పుడు తక్కువ పెట్టుబడి పెట్టటం వల్ల సరాసరి తగ్గిపోతుంది. దీనితో ఎక్కువ రాబడి పొందేందుకు వీలు ఉంటుంది.
మరీ ఎక్కువ స్థాయిలో ఉన్న ఫండ్లను విక్రయించేందుకూ ఈ స్మార్ట్ సిప్ అవకాశం కల్పిస్తుంది. ఈ సౌకర్యాన్ని పలు మ్యుచువల్ ఫండ్ కంపెనీలు కల్పిస్తున్నాయి. దీని ద్వారా కనీస పెట్టుబడి, గరిష్ఠ పెట్టుబడిని కస్టమర్ నిర్దేశించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సరాసరి ద్వారా ప్రయోజనం పొంది, అధిక రాబడులను పొందేందుకు నిర్ణీత సిప్ లానే ఇందులో కూడా పెట్టుబడిని కొనసాగించాలి.
కనిష్ఠ, గరిష్ఠ పెట్టుబడిని వారి సామర్థ్యం మేరకు నిర్ణయించుకోవాలి. స్మార్ట్ సిప్ పై పూర్తి అవగాహన సంపాదించిన అనంతరమే ఈ పద్ధతిని ఎంచుకోవాలని స్పష్టం చేస్తున్నారు వ్యక్తిగత ఆర్థిక నిపుణులు.
ఇదీ చూడండి:స్టాక్స్‌లో పెట్టుబడులా? ఇవి తెలుసుకోవాల్సిందే..