తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆదాయ పన్ను విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఈ నెలాఖరుతో 2020-21 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ప్రస్తుత సంవత్సరానికి పన్ను మినహాయింపు పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకున్నా.. మార్చి 31 లోపే ఆ పనిని పూర్తి చేయాలి. గడువు తేదీ సమీపిస్తున్న కొద్దీ తొందరపాటులో పెట్టుబడుల విషయంలో తప్పులు చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాంటి పొరపాట్లు జరగకుండా.. సరైన పథకాలను ఎంచుకోవడం ఎలా? అనే అంశంపై ఓ ప్రత్యేక కథనం.

Investment plan for tax deduction on return
పన్ను ఆదా పెట్టుబడుల వివరాలు

By

Published : Mar 5, 2021, 1:48 PM IST

Updated : Mar 5, 2021, 4:46 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21కి ఆదాయపు పన్ను మినహాయింపు పొందేందుకు పెట్టుబడులు పెట్టాలనుకుంటే మార్చి 31లోగా పూర్తి చేయాలి. ఈ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పన్ను మినహాయింపు కోసం పథకాలను ఎంచుకునే వారు కాస్త తొందర పడటం సహజమే. ఇలాంటప్పుడు చిన్న పొరపాటు చేసినా.. దీర్ఘకాలంలో దాని ఫలితం ప్రతికూలంగా ఉంటుంది. అందుకే, పన్ను ఆదా కోసం పథకాలను ఎంచుకునేటప్పుడు అవి మన లక్ష్య సాధనలో ఎంత వరకూ ఉపయోగపడతాయన్నదీ చూడాలి.

గత ఆర్థిక సంవత్సరం అంటే.. 2019-20కి సంబంధించి.. పన్ను ఆదా కోసం పెట్టుబడులను పెట్టేందుకు జూన్‌ 30 వరకూ గడువు ఇచ్చారు. మీరు ఈ వ్యవధిలో మదుపు చేసి, గత ఆర్థిక సంవత్సరం రిటర్నులల్లో చూపిస్తే.. ఈసారి వాటిని పేర్కొనడానికి వీల్లేదు. ఈ సంగతిని గుర్తుంచుకోండి.

కొత్త విధానమా.. పాత పద్దతా..

గత ఏడాది.. ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కొత్త పన్నుల విధానాన్ని ప్రతిపాదించారు. ఇందులో పన్ను చెల్లింపుదారుడు ఎలాంటి మినహాయింపులు అవసరం లేదు అనుకుంటే.. ఆదాయాన్ని బట్టి, నిర్ణీత శ్లాబుల్లో పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ప్రామాణిక తగ్గింపు, సెక్షన్‌ 80సీ, ఇంటి రుణంపై చెల్లించిన వడ్డీలాంటివేవీ క్లెయిం చేసుకునేందుకు వీలుండదు. కాబట్టి, మీరు ఏ పన్ను విధానం ఎంచుకోవాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోండి. పాత, కొత్త విధానంలో ఎంత పన్ను చెల్లించాల్సి వస్తుందన్నది ఒకసారి గణిస్తే.. మీకు విషయం అర్థం అవుతుంది.

మొత్తం ఒకే చోట..

చాలామంది చివరి నిమిషంలో పన్ను ఆదా కోసం పెట్టుబడిగా బీమా పాలసీ వైపే మొగ్గు చూపిస్తారు. సెక్షన్‌ 80సీ కింద బీమా ప్రీమియానికి మినహాయింపు లభిస్తుంది. జీవిత బీమా లక్ష్యం పన్ను ఆదా కాదు.. అది అందించే అదనపు ప్రయోజనం మాత్రమే. సంప్రదాయ మనీ బ్యాక్, ఎండోమెంట్, యులిప్‌ల వంటివి తీసుకున్నప్పుడు వీటివల్ల మీ బీమా రక్షణ లక్ష్యం పూర్తిగా నెరవేరకపోవచ్చు. బీమా కోసం టర్మ్‌ ప్లాన్‌ సరిపోవచ్చు. మిగతా మొత్తాన్ని పెట్టుబడిగా సరైన పథకానికి మళ్లిస్తే అధిక ప్రయోజనం ఉండొచ్చు. ఈ విషయాన్ని పరిగణనలోనికి తీసుకొని, పన్ను ప్రణాళిక వేసుకోవాలి.

ఆదాయాలన్నీ చూసుకోండి..

పన్ను వర్తించే ఆదాయాన్ని లెక్క తీసేటప్పుడు మీకు వస్తున్న మొత్తం ఆదాయాలను చూడాలి. జీతం కాకుండా.. అద్దె, బ్యాంకు/పోస్టాఫీసు నుంచి వడ్డీలు, వ్యాపారాదాయం, మూలధన రాబడి ఇంకా ఇతర మార్గాల్లో ఆదాయం ఉన్నప్పుడు వాటన్నింటినీ ఒక చోట రాసుకోండి. దీంతోపాటు పన్ను ఆదా పథకాల్లో ఎంత మేరకు పొదుపు చేశారు.. ఇంకా ఎంత అవకాశం ఉందన్నదీ చూడండి. దీనివల్ల మీకు ఎంత పన్ను భారం పడుతుందనేది ఒక స్పష్టత వస్తుంది. ఆ తర్వాత మీరు పన్ను ఆదా కోసం ఎంత మదుపు చేయాలనేది చూసుకోవచ్చు. ఆదాయాలన్నీ చూసుకోండి..

80సీకి మించి..

పన్ను ఆదా కోసం ప్రధానంగా సెక్షన్‌ 80సీని చెప్పుకోవాలి. ఇందులో ఈపీఎఫ్, పీపీఎఫ్, ఈఎల్‌ఎస్‌ఎస్, జీవిత బీమా ప్రీమియం, గృహరుణం అసలు, పిల్లల ట్యూషన్‌ ఫీజులు ఇలా అనేక పెట్టుబడి పథకాలు వస్తాయి. మొత్తం మీద రూ.1,50,000 వరకూ మినహాయింపు క్లెయిం చేసుకోవచ్చు. దీనికి అదనంగా.. సెక్షన్‌ 80సీసీడీలో భాగంగా ఎన్‌పీఎస్‌లో మదుపు చేయొచ్చు. ఆరోగ్య బీమా ప్రీమియానికి సెక్షన్‌ 80డీలో, విద్యా రుణానికి చెల్లించిన వడ్డీకి 80ఈ ప్రకారం మినహాయింపులు పొందేందుకు వీలుంటుంది.

లక్ష్య సాధనకు దూరంగా..

పన్ను ఆదా పథకాల్లో మదుపు చేసినప్పుడు అవి.. మన ఆర్థిక లక్ష్యాల సాధనకూ తోడ్పాటునందించాలి. అదే సమయంలో వాటిలో ఉండే నష్టభయాన్నీ చూసుకోవాలి. మీరు నష్టభయాన్ని భరించలేకపోతే.. సంప్రదాయ పొదుపు పథకాలైన పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్, పన్ను ఆదా బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, జాతీయ పొదుపు పత్రాల్లాంటివి ఎంచుకోవడం మేలు. కాస్త నష్టం వచ్చినా ఇబ్బంది లేదు అనుకుంటే.. ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో మదుపు చేయొచ్చు. దీనికి మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. పన్ను ఆదా పథకాల్లో తక్కువ వ్యవధి ఉన్నవి ఇవే. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచే క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌)లో మదుపు చేయడం మంచి ఫలితాన్నిస్తుంది.

మార్చి నెలాఖరులోపు మీ పెట్టుబడులన్నీ పూర్తి చేయాలి. కాబట్టి, ఒకసారి మీ యాజమాన్యాన్ని అడిగి, ఇంకా ఎంత మొత్తం మదుపు చేయాలో తెలుసుకోండి. అవసరానికి మించి పన్ను ఆదా పథకాల్లో మదుపు చేయడం వల్ల ఫలితం ఉండదు.

ఇదీ చూడండి:నెలకు రూ.8వేలు రాబడి రావాలంటే..

Last Updated : Mar 5, 2021, 4:46 PM IST

ABOUT THE AUTHOR

...view details