ప్రభుత్వానికి సకాలంలో పన్ను చెల్లించడం ప్రతి పన్ను చెల్లింపుదారుడి విధి. ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను దాఖలు చేయడంలో ఆలస్యం చేసి జరిమానాలు పడకుండా క్రమశిక్షణ కలిగి ఉండటం మంచిది.
కొవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో 2019-20 మదింపు సంవత్సరానికి ఆలస్యమైన లేదా సవరించిన ఐటీఆర్‌ని దాఖలు చేయడానికి చివరి తేదీ ఇప్పటికే ఈ సంవత్సరం చాలాసార్లు పొడిగించింది ప్రభుత్వం. ఆడిట్ వర్తించని పన్ను చెల్లింపుదారు కోసం తుది గడువును నవంబర్ 30 నుంచి డిసెంబర్ 31 వరకు వాయిదా వేసింది. ఆడిట్ చేయాల్సిన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కోసం, రిటర్న్ ఫైలింగ్ చివరి తేదీని 2020 అక్టోబర్ 31 నుంచి 2021 జనవరి 31 కి మార్చారు.
అయితే గడువు పెరిగింది కదా అని.. రిటర్ను దాఖలు చేసేందుకు చివరి వరకూ చూడటం సరైంది కాదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అందుకు రెండు కారణాలున్నాయి.
రీఫండ్ ఆలస్యం:
పన్ను చెల్లింపుదారులు రీఫండ్ ఆశిస్తే.. రిటర్ను ముందుగానే దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రిటర్నులను ప్రాసెస్ చేసేందుకు ఆదాయ శాఖకు నెల వరకు సమయం పడుతుంది. దీనితో పాటు ముందుగా దాఖలు చేసిన రిటర్నులను ముందు ప్రాసెస్ చేసి.. అలస్యంగా వచ్చిన వాటిని లేటుగా ప్రాసెస్ చేస్తాయి. ఈ కారణంగా మీ రీఫండ్ ఆలస్యమయ్యేందుకు అవకాశం ఉంది. ఈ ఆలస్యం జరగకుండా ముందుగానే రిటర్ను దాఖలు చేయడం ద్వారా రీఫండ్‌ను త్వరగా పొందొచ్చు.
పన్ను చెల్లింపుదారునికి అదనపు పన్ను, టీడీఎస్ లేదా టీసీఎస్ రీఫండ్ అవసరమైతే, ఐటీఆర్ ముందస్తుగా దాఖలు చేస్తే త్వరగా రీఫండ్ పొందవచ్చు. నిర్ణీత తేదీ తర్వాత ఐటీర్ దాఖలు చేయడం కూడా ఒక నిర్దిష్ట కాలం వరకు అనుమతిస్తారు. అయితే, అటువంటి సందర్భాల్లో పన్ను చెల్లింపుదారులు జరిమానా చెల్లించాలి. పన్ను ఎగవేత అనేది చట్టపరంగా నేరం కాబట్టి దానికి తగిన శిక్ష కూడా పడే అవకాశముంది.
సెక్షన్ 234ఏ కింద అధిక వడ్డీ:
చెల్లించాల్సిన పన్ను మొత్తం రూ.లక్ష దాటిన ఆడిట్ చేయవలసిన అవసరం లేని వ్యక్తి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234 ఏ కింద వడ్డీని పరిమితం చేయడానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ వరకు వేచి ఉండకూడదు.
ఖాతాలను ఆడిట్ చేయవలసిన అవసరం లేని, పన్ను బాధ్యత రూ. లక్ష దాటిన వ్యక్తులు 2020 డిసెంబర్ 31, పొడిగించిన గడువు తేదీల వరకు వేచి ఉండకూడదు. ఎందుకంటే సెక్షన్ 234 ఏ కింద వడ్డీ జులై 31 నుంచి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన తేదీ వరకు వర్తిస్తుంది. అందువల్ల అటువంటి పన్ను చెల్లింపుదారుడు సెక్షన్ 234 ఏ కింద వడ్డీని తగ్గించడానికి వీలైనంత త్వరగా తన ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయాలి.
రూ.1 లక్షకు మించని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కోసం వడ్డీ సెక్షన్ 234ఏ కింద, పొడిగించిన గడువు తేదీ డిసెంబర్ 31, 2020 నుంచి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన తేదీ వరకు వసూలు చేస్తారు
ఇదీ చూడండి:వైద్య ఖర్చులకు ప్రభుత్వ సాయం అంతంతే!