బిట్‌కాయిన్, ఇథేరియం వంటి క్రిప్టోకరెన్సీలు కేవలం కరెన్సీలు మాత్రమే కాదని.. వీటిని ఆస్తిగా కూడా పరిగణించొచ్చని అభిప్రాయపడ్డారు ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్.
'ట్యాక్సేషన్ కోసం.. కచ్చితంగా క్రిప్టోకరెన్సీ స్వభావంపై ఉన్న సందేహాలను ప్రభుత్వం తొలగించాల్సిన అవసరం ఉంది. క్రిప్టోకరెన్సీని కమోడిటిగా భావిస్తే.. దీనికి జీఎస్టీ మాత్రమే వర్తిస్తుంది. అలా కాకుండా ఆస్తిగా పరిగణిస్తే.. దానిపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన ఆదాయాలపై పన్ను విధించే వీలుంటుంది.' అని గార్గ్ వివరించారు.
'కేవలం కరెన్సీపైన మనకు ఆదాయం రాదు. కాబట్టి దానిపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.' అని ముంబయి కేంద్రంగా పని చేస్తున్న ఫిన్‌టెక్ సంస్థ ఈపీఎస్ ఇండియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో గార్గ్ ఈ విషయాన్ని పేర్కొన్నారు.
కరెన్సీ ఆస్తితో కలిసిపోయి ఉన్నప్పుడే సమస్య తలెత్తుతుంది అని 'ఈటీవీ భారత్' అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు గార్గ్.
"ఆస్తి.. ఆదాయంతో ముడిపడి ఉంటుంది. మీరు బిట్‌కాయిన్‌ను 10 వేల డాలర్ల వద్ద కొని.. 50 వేల డాలర్ల వద్ద విక్రయిస్తే. అప్పుడు మీరు 40 వేల డాలర్లు లాభం పొందినట్లు. కాబట్టి ఈ 40 వేల డాలర్లపై పన్ను విధించొచ్చు."
-సుభాశ్ చంద్ర గార్గ్, ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి
"బిట్‌కాయిన్ సహా ఇతర క్రిప్టోకరెన్సీల క్రయ విక్రయాల ద్వారా ఆదాయం గడిస్తే.. అది షేర్లు, రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే ఆదాయంలానే పరిగణించాల్సి వస్తుంది. వాటికి స్వల్ప, దీర్ఘ కాలంలో మూలధన లాభాలు ఉంటాయి. కాబట్టి వాటిపై పన్ను విధించొచ్చు" అని పేర్కొన్నారు.
'ఈక్విటీ షేర్లకు ఐపీఓ ద్వారా అనుమతినిచ్చినట్లే.. ప్రాథమికంగా కాయిన్ల కోసం 'ఇనీషియల్ కాయిన్ ఆఫర్' పేరుతో అనుమతినివ్వాలి. కాయిన్లను ఈక్విటీల్లానే పరిగణించాలి. అప్పుడవి అన్ని నియంత్రణ నిబంధనలకు లోబడి లిస్ట్ అవుతాయి. వాటి ట్రేడింగ్ కూడా సులభమవుతుంది. ప్రభుత్వం దీన్ని అమలు చేయగలిగితే.. అర్హత ఉన్న క్రిప్టోకరెన్సీలు లిస్టింగ్‌కు, ట్రేడింగ్‌కు అనుమతి పొందుతాయి. అప్పుడు వాటిపై పన్ను విధించడం కూడా సులభమవుతుంది.' అని గార్గ్ అభిప్రాయపడ్డారు.
క్రిప్టోకరెన్సీల ప్రయాణం
ప్రపంచంలో మొట్టమొదటి క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్. షాతోషీ నాకామోటో అనే పేరుతో కొంతమంది గ్రూప్‌గా ఏర్పడి ఈ బిట్‌కాయిన్ రూపొందించారు. ఇది 2009లో వినియోగంలోకి వచ్చింది. దీని తర్వాత లిట్‌కాయిన్, ఇథేరియం, కార్డనో, పోల్కాడాట్, బిట్‌కాయిన్ క్యాష్, స్టెల్లార్ సహా అనేక క్రిప్టోకరెన్సీలు పుట్టుకొచ్చాయి.
కాయిన్ మార్కెట్ క్యాప్ అంచనా ప్రకారం ప్రస్తుతం 8,500 వరకు క్రిప్టోకరెన్సీలు మనుగడలో ఉన్నాయి. వీటి మొత్తం విలువ 1.45 ట్రిలియన్ డాలర్లు. వేల సంఖ్యలో క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు వీటి ట్రేడింగ్ నిర్వహిస్తున్నాయి.
ఇన్ని క్రిప్టోకరెన్సీలు ఉన్నా అందులో బిట్‌కాయిన్ అగ్రస్థానంలో ఉంది. 2009లో ఇది మనుగడలోకి వచ్చినా.. 2011లో ఇది డాలర్ మార్క్‌ను అందుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా పెరుగుతూ.. 2020 చివరి నుంచి రికార్డు స్థాయిలో పుంజుకుంటోంది. ఇటీవల జీవనకాల గరిష్ఠమైన 58,300 మార్క్‌ను దాటింది. దీనితో బిట్‌కాయిన్ మార్కెట్ క్యాపిటల్ కూడా 1 ట్రిలియన్ డాలర్ల మార్క్‌పైకి చేరింది. అన్ని క్రిప్టోకరెన్సీల ఎం-క్యాప్‌లో బిట్‌కాయిన్ వాటానే 60 శాతం ఉందంటే ఆశ్చర్యం కాదు.
క్రిప్టో కరెన్సీని ఎందుకు విస్మరించలేం?
ఇటీవలి కాలంలో క్రిప్టో కరెన్సీలు విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. పెద్ద పెద్ద సంస్థలు, పారిశ్రామిక దిగ్గజాలు కూడా ఇందులో పెట్టుబడి పెడుతున్నాయి. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఇటీవల బిట్‌కాయిన్‌లో 1.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించారు. దీనితో బిట్‌కాయిన్ విలువ అమాంతం కొత్త రికార్డులకు చేరింది.